కాబూల్ : భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలతో తాము మైత్రిని మాత్రమే కోరుకుంటున్నట్లు తాలిబన్ గ్రూప్ అధికార ప్రతినిధి మహ్మద్ సుహైల్ షాహీన్ పేర్కొన్నాడు. సైనిక చర్యలతో ఏమీ సాధించలేమని.. శాంతియుత చర్చల ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం దొరకుతుందని అభిప్రాయపడ్డాడు. తమ దేశం నుంచి అమెరికా సైన్యాలు వెనక్కి వెళ్లినంత మాత్రాన భారత్ భయపడాల్సిన అవసరం లేదని... ఎవరికీ హానీ చేసే ఉద్దేశం తమకు లేదని వ్యాఖ్యానించాడు. అఫ్గనిస్తాన్‌లో మోహరించిన తమ సైన్యంపై దాడి చేసి... సైనికులను పొట్టనబెట్టుకుంటున్నారంటూ తాలిబన్లపై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్‌్డ ట్రంప్.. వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎన్‌ఎన్‌తో మాట్లాడిన షాహీన్ తమ విధానాలను స్పష్టం చేశాడు.
చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది
‘గత 18 ఏళ్లుగా మిలిటరీ ద్వారా అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఏవీ సరైన ఫలితం ఇవ్వలేదన్న విషయం అందరికీ తెలిసిందే. అఫ్గాన్ సమస్యకు అమెరికన్ల వద్ద పరిష్కారం ఉంటే శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలా జరగని పక్షంలో వారు చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి తమ సైనికుడిని చంపామని ట్రంప్ అంటున్నారు. కానీ ఇక్కడ రక్తపాతం మొదలుపెట్టింది ఎవరు? అమెరికా సైన్యాలు దాడి చేస్తే మేము అందుకు బదులు ఇస్తున్నాం అంతే. మా ప్రజలపై దాడిని తిప్పికొడుతున్నాం. ఒప్పందం కుదిరిన మరుక్షణమే అమెరికా సైన్యం మాపై మరోసారి కాల్పులకు తెగబడవచ్చు. అదే విధంగా మేము కాబూల్ పాలనలో జోక్యం చేసుకుంటున్నామన్న విషయం సరైంది కాదు. దేశ అంతర్గత, బాహ్య సమస్యలపై మేము దృష్టి సారించాలనుకుంటున్నాం. అమెరికా సైన్యాలు వెనక్కి వెళ్లిన తర్వాత అమెరికా, దాని మిత్ర దేశాలకు వ్యతిరేకంగా మేము ఎటువంటి చర్యలకు పూనుకోకూడదు. అప్పుడు కచ్చితంగా దేశ అంతర్గత విషయాలపై ప్రజల తరఫున పోరాటం చేస్తాం’ అని షాహీన్ చెప్పుకొచ్చాడు.
అదే విధంగా పాకిస్తాన్ జోక్యంతోనే అఫ్గాన్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... తాము ఇప్పటికే అమెరికాతో చర్చల దశలో ఉన్నామని, ఎవరికి మేలు చేకూర్చే విధంగానో... ఎవరితోనో వైరం పెంచుకునే తరహాలోనూ తాము వ్యవహరించమని స్పష్టం చేశాడు. ఇక అమెరికా సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్లిన తర్వాత భారత్‌లో తాలిబన్లు అలజడి సృష్టించే అవకాశం ఉందన్న ప్రచారం గురించి మాట్లాడుతూ... తమకు ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని... దేశ పునర్నిర్మాణానికి, అభివృద్ధికి తాము అంకితం అవుతామని.. ఇందుకు భారత్ సహాయం కూడా అవసరమని షాహీన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment