
అమెరికాకి సైనికులు కరువవుతున్నారోచ్!
ప్రపంచ పెద్దన్నకి సైనికులు కరువవుతున్నారు. కారణం ఏమిటో తెలుసా? పచ్చబొట్టు. ఫేషన్ కోసం యువకులు పచ్చబొట్టు పొడిపించుకుంటే చివరికి దాని వల్ల సైన్యంలో చేరలేకపోతున్నారు.
అమెరికా అంతటా వేలం వెర్రిలా వ్యాపిస్తున్న టాటూల పిచ్చి, పియర్సింగ్ పిచ్చి చివరికి అమెరికా సైన్యంలో సైనికులే లేని పరిస్థితికి తీసుకొస్తోంది. ఒక వేళ టాటూలు ఉన్న వారు వాటిని తొలగించుకోవాలంటే దానికి కనీసం ఏడాది పడుతుంది. అప్పట్లో పరిస్థితులు మారిపోయి, అర్హత కోల్పోతున్నారు.
అందుకే అమెరికన్ సైన్యాధికారులు పచ్చబొట్టు వ్యతిరేక ప్రచారోద్యమాన్ని ప్రారంబించారు. ఇప్పటికే అమెరికన్ యువకుల్లో 71 శాతం మంది సైన్యంలో చేరడానికి పనికి రారు. నేర చరిత్ర ఉన్న వాళ్లు కొందరైతే, మాదక ద్రవ్యాలు వాడిన చరిత్ర ఉన్న వాళ్లు మరికొందరు. ఇవన్నీ చాలవన్నట్టు అమెరికన్ యువకుల్లో సగం మంది ఊబకాయులే. వీరు సైన్యానికి పనికిరారు.
అమెరికన్ సైన్యంలో చేరాలంటే వయసు 17 నుంచి 24 మధ్యలో ఉండాలి. ఆర్మీ రాత పరీక్షలో పాసవ్వాలి. ఇన్సులిన్ తీసుకునేంత సీరియస్ డయాబెటిస్ ఉండకూడదు. పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. చెవులకు పియర్సింగ్ చేయించుకోకూడదు. చెవి రింగులు ధరించకూడదు. ఇవి కాక మిగతా శారీరిక అర్హతలు, విద్యార్హతలు కూడా ఉండనే ఉన్నాయి.
అమెరికా ఇప్పుడు పలు దేశాల్లో సైనిక చర్యలు జరుపుతుంది. దానికి ప్రపంచ వ్యాప్తంగా సైనిక స్థావరాలున్నాయి. నానాటికీ సైనికావసరాలు పెరుగుతున్నాయి. కానీ దానికి తగినంత సిబ్బంది మాత్రం లేకపోవడం అమెరికాను బాధిస్తోంది.