
స్టంట్ చేయబోయి..
సింగపూర్ :
అసలే యువకుడు పక్కనే ఓ అమ్మాయి. చేతిలో ఫోన్, అందులోనూ ఇతరులతో వీడియో చాటింగ్. ఇంకేముంది.. ఓ అద్భుతమైన స్టంట్ చేసి వీడియో చాట్‌లో ఉన్న స్నేహితులను, పక్కనే ఉన్న వారి దృష్టిని ఒకేసారి ఆకర్షించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఒక్కసారిగా దూకి తన అంచనా తప్పి నాలుగంతస్తుల భవనం పై నుంచి పడి బంగారు భవిష్యత్తును చేతులారా చేజార్చుకున్నాడో యువకుడు.
వివరాలు..17 ఏళ్ల జోనాథన్ చో తన స్నేహితురాలు రుతుతో కలిసి సింగపూర్‌లోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. నాలుగో అంతస్తుపైకి చేరుకోగానే తన ఫోన్‌లో మరొకరితో స్నాప్ చాట్‌లో వీడియో కాల్‌లో సంభాషిస్తున్నాడు. ఒక్కసారిగా ఫోన్‌ను రుతు చేతికి ఇచ్చి స్టంట్ చేస్తున్నాను, వీడియో తీయి అని చెప్పి బిల్డింగ్ బయటివైపు ఉన్న కొన భాగంపై దూకడానికి ప్రయత్నించాడు.
అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బిల్డింగ్‌పైనుంచి కిందపడకుండా అడ్డుగా ఉన్న నిర్మాణం పై చేతులు పెట్టి జోనాథన్ ఒక్కసారిగా బయటవైపున్న బిల్డింగ్ కొన భాగంపై దూకాడు. ఇది చాలా డేంజర్ స్టంట్ అని తనకు తెలుసని కానీ, అతనికి చెప్పేలోపే జొనాథన్ దూకేశాడని రుతు కన్నీటిపర్యంతమయ్యింది. బిల్డింగ్ కొన కాంక్రీట్తో నిర్మించామని మేమిద్దరం అనుకున్నామని చెప్పింది. అయితే బిల్డింగ్‌కొన నిర్మాణం జోనాథన్ బరువును మోయలేకపోవడంతో సరాసరి నాలుగు అంతస్తుల పై నుంచి భూమి మీద పడి మరణించాడు.