వీడియో కోసం నాలుగో అంతస్తు నుంచి దూకి...
సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం కోసం నాలుగో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడో యువకుడు. ఈ ఘటన సింగపూర్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో జరిగింది. జొనాథన్ చో (17) అనే ఈ యువకుడు తన స్నేహితురాలితో కలిసి మాల్‌కు వెళ్లాడు. అక్కడ తాను పైనుంచి సన్ షేడ్ మీదకు దూకుతానని, అదంతా వీడియో తీయాలని ఆమెను కోరాడు. అయితే.. ఆ సన్‌షేడ్ ప్లాస్టిక్ బోర్డుతో చేసినది కావడంతో అంత ఎత్తు నుంచి వచ్చిన అతడి బరువును ఆపలేకపోయింది. అతడు దాని మీద పడగానే అది కాస్తా కూలిపోయింది. దాంతో పైనుంచి తన స్నేహితురాలు చూస్తుండగానే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఆస్ట్రేలియాలో చదువుకుని, సింగపూర్‌లో తన నేషనల్ సర్వీస్ పూర్తి చేసేందుకు వచ్చిన జొనాథన్.. ఇలా సోషల్ మీడియా పిచ్చితో ప్రాణాలు కోల్పోయాడు. సన్ షేడ్ కాంక్రీటుతో చేసి ఉంటారని ఇద్దరం అనుకున్నామని, కానీ అతడు దూకగానే అది పడిపోయిందని అతడి స్నేహితురాలు రూత్ చెప్పింది. అక్కడి నుంచి దూకడం ప్రమాదకరమని తాను చెప్పేలోపే అతడు దూకేశాడని, తాను కూడా దూకుదాం అనుకున్నాను గానీ.. తర్వాత తెలిసిందని వివరించింది. అటువైపు వెళ్తున్న నలుగురు అతడిని కాపాడేందుకు ఆస్పత్రికి తరలించారు గానీ, అక్కడ జొనాథన్ మరణించాడు.