![Man held for killing his wife in Udupi](/styles/webp/s3/article_images/2024/08/24/68.jpg.webp?itok=o0Mipwhq)
దొడ్డబళ్లాపురం: ప్రచారం పిచ్చో... డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఆశనో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో చాలామందికి రీల్స్ పిచ్చి పట్టుకుంది. కొన్నిసార్లు ఇది కాస్తా శ్రుతిమించి పోయి వ్యవసనంగానూ మారిపోతోంది. ఆఖరుకు ఇది దాంపత్య జీవితంలోనూ చిచ్చు పెట్టే స్థితికి చేరుకుంది. అయితే కర్ణాటకలోని ఉడుపికి సమీపంలోని కార్కడలో ఈ రీల్స్ పిచ్చి కాస్తా ఓ నిండుప్రాణం పోయేందుకు కారణమైంది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...
బీదర్‌లోని దోణగాపురకు చెందిన జయశ్రీ (31)కి రీల్స్ అంటే తెగ పిచ్చి. ఈమెకు కార్కడ సమీపంలోని గుండ్మిలో నివసించే కిరణ్ ఉపాధ్య (44)తో పెళ్లి అయ్యింది. కొంత కాలం సంసారం బాగానే నడిచింది కానీ.. జయశ్రీ నిత్యం రీల్స్ చేస్తూండటం కిరణ్‌కు ఏ మాత్రం నచ్చలేదు. అంతేకాదు... జయశ్రీ ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం విషయంలోనూ భార్య భర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు అవుతూండేవి. తనకు పెద్ద ఇల్లు కావాలని... లగ్జరీ కారు.. నగదు కావాలని... గుడులలో వంటలకు సాయంగా పనిచేస్తున్న భర్త కిరణ్‌ను వేధించేది. ఇది కాస్తా వారిద్దరి మధ్య వివాదం మరింత ముదిరేందుకు కారణమైంది. ఇలాగే కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య రీల్స్ విషయమై వాదులాట మొదలైంది.
ఈ క్రమంలోనే కిరణ్ కొడవలితో దాడి చేయడంతో జయశ్రీ మరణించింది. ఆ తరువాత బంధు మిత్రులకు ఫోన్ చేసి జయశ్రీ మొదటి అంతస్తులోంచి కిందకు పడిపోయిందని... స్పందన లేదని చెప్పాడు. వారి సలహాతో ఆంబులెన్స్‌కు ఫోన్ చేశాడు కూడా. అయితే జయశ్రీ ఆసుపత్రికి చేరే సమయానికి ప్రాణాలతో లేదని డాక్టర్లు ప్రకటించారు. అయితే... ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తరువాత కిరణ్ ప్రవర్తన తేడాగా ఉండటాన్ని చుట్టుపక్కల వాళ్లు గమనించారు.
ఇంట్లో రక్తపు మరకల్ని తొలగించే ప్రయత్నం చేశాడు. అనుమానం కొద్దీ ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు కిరణ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. కిరణ్ ముందస్తు ప్రణాళికతోనే జయశ్రీని హత్య చేశాడని, గత గురువారమే మార్కెట్‌లో కొత్త కొడవలిని కొనుగోలు చేశాడని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment