‘ఉగ్ర’ అంచనాపై ఐరాస విఫలం
♦ ఇంకా ఉగ్రవాదానికి నిర్వచనం వెతుకుతున్నారు
♦ 40 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని భరిస్తున్నాం
బ్రసెల్స్‌లో మండిపడ్డ ప్రధాని మోదీ
పాన్ కార్డు లేని ఎన్నారైలకు టీడీఎస్ నుంచి విముక్తి
బ్రసెల్స్: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ప్రమాదకర సమస్యగా మారినా.. దీన్ని అణచివేసే ప్రయత్నంలో ఐక్యరాజ్యసమితి స్పందన అంతంత మాత్రంగానే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. బ్రసెల్స్‌లో భారతీయులనుద్దేశించి మోదీ మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా భారత్ ఉగ్రవాద సమస్యను భరిస్తోందని.. మిగతా ప్రపంచానికి ఉగ్రవాదం ఎంత క్రూరంగా ఉంటుందో ఇప్పుడే తెలిసిందన్నారు. ‘గతేడాది 90 దేశాల్లో ఉగ్రదాడుల కారణంగా వేల మంది మరణిస్తే.. ఐక్యరాజ్య సమితి ఇంకా ఉగ్రవాదానికి నిర్వచనాన్ని ఆలోచిస్తోంది. భీకరమైన యుద్ధాల ద్వారా పుట్టిన ఐరాస అంతకుమించి ఆలోచించలేదు’ అని మోదీ ఘాటుగా విమర్శించారు.
ఉగ్రవాదం తీవ్రతను గుర్తించి సరిగ్గా స్పందించటంతో ఐక్యరాజ్య సమితి ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఉగ్రవాదం విషయంలో ఓ అంచనాకు రావాలంటూ దశాబ్దాలుగా భారత్ కోరుతున్నా ఐరాస స్పందించలేదన్నారు. ఇకనైనా ఈ అత్యున్నత సంస్థ నుంచి స్పందన లేకపోతే.. అది (ఐరాస) ఉన్నా ప్రయోజనం లేదన్నారు. పాక్ తీరునూ ప్రధాని పరోక్షంగా విమర్శించారు. ఉగ్రవాదాన్ని మతంతో ముడిపెట్టకూడదని.. ఈ విపరీత పరిస్థితిని తుపాకులు, బాంబులతో నిర్మూలించలేమన్నారు.
యువత ఉగ్రవాదం బారిన పడకుండా చూడటం.. అందుకు అనుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. కాగా, రెండేళ్లుగా భారత్‌లోని చాలా ప్రాంతాల్లో కరువు రాజ్యమేలుతున్నా.. దేశ పురోగతి ఆగలేదన్నారు. పాన్ లేని ఎన్నారైలకూ ఎక్కువ టీడీఎస్ రేటు నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. దీంతోపాటు ఎన్నారైలకు ఉచిత బ్యాగేజీ పరిమితిని కూడా పెంచనున్నట్లు మోదీ తెలిపారు. తన ప్రసంగం ముగించే ముందు బ్రసెల్స్ మృతులకు నివాళిగా ఒక నిమిషంపాటు నిశ్శబ్దం పాటించారు.
అమెరికా చేరుకున్న మోదీ
అమెరికాలో రెండ్రోజులపాటు జరిగే.. అణు భద్రత సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ వాషింగ్టన్ చేరుకున్నారు. అణ్వాయుధాలు, ఇతర అణుశక్తి వినియోగం ద్వారా జరిగే ప్రమాదాలపై చర్చించనున్న ఈ సదస్సుకు 50 దేశాల ప్రతినిధులు హాజరవుతారు. తొలిసారి ఈ సమావేశానికి హాజరైన మోదీ ఈ అంశంపై సదస్సులో తన అభిప్రాయాలు పంచుకోనున్నారు. అమెరికా పర్యటనలో న్యూజీలాండ్ ప్రధానితో మోదీ సమావేశమయ్యారు. ఒబామాతోపాటు అమెరికా కార్పొరేట్ కంపెనీల సీఈవోలు, శాస్త్రవేత్తలతో మోదీ సమావేశం కానున్నారు.
‘లిగో’ ఒప్పందంపై సంతకాలు
గురుత్వాకర్షణ తరంగ ఖగోళ శాస్త్రంలో మరింత విసృతమైన పరిశోధనల్లో భారత్ కీలక పాత్ర పోషించనుంది. ఈ దిశగా.. భారత్-అమెరికా మధ్య ఒప్పందంపై ప్రధాని మోదీ సమక్షంలో ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో భారత దేశంలో లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో) ఏర్పాటు కానుంది.