ఐరాసలో సంస్కరణ రావాల్సిందే!
భారత్, ఆఫ్రికా దేశాల ఉద్ఘాటన
♦ 19 దేశాధినేతలతో ప్రధాని మోదీ భేటీ
♦ అభివృద్ధి, పెట్టుబడులు, వాణిజ్యంపై చర్చలు
♦ ఉగ్రవాదంపై సమగ్ర వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయం
న్యూఢిల్లీ: భారత్-ఆఫ్రికా దేశాల సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం 19 దేశాధినేతలతో చర్చలు జరిపారు. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు, ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు, వాణిజ్యం, చమురు రంగంలో పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. ఆఫ్రికాలో భారత్ చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై దేశాధినేతలు హర్షం వ్యక్తంచేశారు. ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో కూడా భారత్‌తో బంధాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నామన్నారు. భేటీలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా మాట్లాడుతూ... ‘ఐరాసలో సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఐరాసలో.. 21వ శతాబ్దికి అనుగుణంగా మార్పులు రావాలి’ అని అన్నారు. ఐరాసలో.. ప్రత్యేకించి భద్రతా మండలిలో సంస్కరణల కోసం ఒత్తిడి తెచ్చేందుకు భావసారూప్యం గల దేశాలు ఏకం కావాలని, మండలిలో కొన్ని దేశాలకు ఉన్న వీటో అధికారాల వల్ల సిరియా వంటి సంక్షోభాలు పరిష్కారం కావడం లేదదని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళికతో ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం ఉందని మోదీ, జుమా అభిప్రాయపడ్డారు.
బంధం బలోపేతం చేసుకుందాం
జింబాబ్వే అధ్యక్షుడు, ఆఫ్రికన్ దేశాల కూటమి చైర్మన్ రాబర్ట్ ముగాబే, ఘనా దేశాధ్యక్షుడు మహామా, స్వాజిలాండ్ రాజు ఎంస్వతి-3, బేనీ అధ్యక్షుడు బోనీ యాయి, నైజీరియా అధ్యక్షుడు బుహారీ, కెన్యా అధ్యక్షుడు కెన్యాట్టా, ఉగాండా అధ్యక్షుడు ముసెవెనీతో మోదీ భేటీ అయ్యారు. వాణిజ్యం, వ్యవసాయం, ఐటీ, నైపుణ్య అభివృద్ధి, సైబర్ భద్రత, తీరగస్తీ, చమురు అన్వేషణ తదితర రంగాల్లో బంధం మరింత బలోపేతం చేసుకోవాలని నేతలు నిర్ణయించారు. గురువారం జరిగే శిఖరాగ్ర సదస్సుపై ముగాబేతో చర్చించారు. మౌలిక వసతుల కల్పనలో తమ దేశంలో ఏటా 150 కోట్ల బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అవకాశం ఉందని ఘనా అధ్యక్షుడు వివరించారు. పీపీపీ పద్ధతిన రైల్వేలు, విద్యుత్, రహదారులు, పోర్టులు తదితర నిర్మాణాల్లో భాగస్వామ్యం కావాలని భారత్‌ను కోరారు.
భారతీయుల విడుదలకు చొరవ తీసుకోండి
నైజీరియా జైళ్లలో బందీలుగా ఉన్న 11 మంది భారతీయుల విడుదలకు చొరవ తీసుకోవాలని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు బుహారీని కోరారు. మోదీ వినతికి బుహారీ సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా వారి విడుదలకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.
ప్రపంచ వాతావరణ సదస్సుకు మోదీ
ప్యారిస్‌లో నవంబర్ 30న జరిగే ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు ప్రారంభ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారు. దాదాపు 80 దేశాల అధినేతలు పాల్గొనే ఈ సదస్సులో అంతర్జాతీయ వాతావరణ ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నారు.
ప్రధాని ‘ఇండో-ఆఫ్రికన్’ విందుకు కాంగ్రెస్ డుమ్మా
ఆఫ్రికా దేశాల అధినేతలకు ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు ప్రధాన విపక్షం కాంగ్రెస్ నేతలు గైర్హాజరయ్యారు. భారత-ఆఫ్రికా సంబంధాలకు ఆద్యుడైన తొలి ప్రధాని నెహ్రూను అవమానించినందుకు నిరసన బాయ్‌కాట్ చేసినట్లు కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. ‘2006లో కాంగ్రెస్ ఈ సమావేశం కోసం ప్రణాళికలు రూపొందిస్తే.. తన చొరవ వల్లే సమావేశం జరిగిందని మోదీ డబ్బా కొట్టుకుంటున్నారు. ఆయన ఆటను చూసేందుకోసం ఈ విందుకు మేం వెళ్లాల్సిన పనిలేద’ని అన్నారు.