ఢాకాలో రెస్టారెంట్‌పై ఉగ్ర పంజా | terrorists attack cafe and bakery in Dhaka | Sakshi
Sakshi News home page

ఢాకాలో రెస్టారెంట్‌పై ఉగ్ర పంజా

Published Sat, Jul 2 2016 3:09 AM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

ఢాకాలో రెస్టారెంట్‌పై ఉగ్ర పంజా - Sakshi

ఢాకాలో రెస్టారెంట్‌పై ఉగ్ర పంజా

బందీలుగా భారతీయ మహిళ సహా పలువురు విదేశీయులు
రెస్టారెంట్‌ను చుట్టుముట్టిన పోలీసు, ర్యాపిడ్ యాక్షన్ బలగాలు
దుండగులతో చర్చలు జరిపేందుకు అధికారుల ప్రయత్నాలు
రెస్టారెంట్ వద్ద కొనసాగుతున్న కాల్పులు.. 30 మందికి గాయాలు
కాల్పులు, పేలుళ్లతో ముష్కరుల దాడి
ఒక పోలీసు మృతి.. ఇటలీ, అర్జెంటీనా వాసులు ఇద్దరు కూడా!

 
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. దౌత్య ప్రాంతంలో గల ఒక రెస్టారెంట్‌పై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని సాయుధ దుండగులు దాడికి దిగారు. వారి కాల్పులు, పేలుళ్లలో ఒక ఇటలీ పౌరుడు, ఒక అర్జెంటీనా పౌరుడు చనిపోయినట్లు రాత్రి పొద్దుపోయాక వార్తలు వెలువడ్డాయి. వారి దాడిలో పోలీసు, భద్రతా సిబ్బంది సహా 30 మంది గాయపడ్డారు. ఒక పోలీసు అధికారి ఆస్పత్రిలో చనిపోయారు. దుండగులు ఇంకా దాదాపు 20 మందిని బందీలుగా పట్టుకున్నారని, వారిలో ఒక భారతీయ మహిళ సహా విదేశీయులూ ఉన్నారని సమాచారం. వారిలో జపాన్, ఇటలీ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:20 గంటలకు సుమారు తొమ్మిది మంది దుండగులు గుల్షన్ ప్రాంతంలోని హోలీ ఆర్టిసన్ బేకరీ రెస్టారెంట్‌లోకి ‘అల్లా హో అక్బర్’ అని నినాదాలు చేస్తూ చొరబడ్డారని, తుపాకులతో కాల్పులు జరుపుతూ, బాంబులు పేల్చారని పోలీసులు తెలిపారు. వెనువెంటనే భారీ సంఖ్యలో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దుండగులతో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు చెప్పారు. అదే సమయంలో రెస్టారెంట్ నుంచి దుండగులు కాల్పులు జరుపుతూ బాంబులు విసురుతున్నారు. అయితే.. బందీలుగా ఉన్న వారిని సురక్షితంగా విడిపించటం తమ తొలి ప్రాధాన్యమని భద్రతాధికారులు చెప్తున్నారు. ఇందుకోసం సాయుధ చర్య చేపట్టే దిశగా సమాయత్తమవుతున్నారు.

పటిష్ట భద్రత గల దౌత్య ప్రాంతంలోని ఈ రెస్టారెంట్ విదేశీయులు, స్థానికంగా పనిచేసే విదేశీ దౌత్య సిబ్బంది, మధ్య తరగతి ప్రజల సందర్శనకు ప్రసిద్ధి. దీనిపై దాడికి దిగిన సాయుధ ముష్కరులు ఎవరన్నది తెలియనప్పటికీ ఐసిస్ ఉగ్రవాదులు కావచ్చునని భావిస్తున్నారు. రెస్టారెంట్ చీఫ్ చెఫ్ కూడా బందీగా ఉన్నారని బేకరీ నుంచి తప్పించుకుని బయటపడ్డ వంట సిబ్బంది ఒకరు చెప్పినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఢాకాలోని భారత దౌత్య కార్యాలయ సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఉగ్రదాడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement