టెక్సాస్: మహమ్మారి కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా గత కొంతకాలంగా లాక్‌డౌన్‌లో ఉన్న టెక్సాస్ ప్రజలకు శుక్రవారం విముక్తి లభించింది. రెస్టారెంట్లు, రీటెల్ అవుట్‌లెట్లు, సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన ప్రజలు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అయితే కొంతమంది మాస్కులు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ... బయటకు వస్తుంటే మరికొంత మంది మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ బర్డ్ ఫ్లూ, సాధారణ న్యుమోనియా వంటిదేనని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి నాయకులు వైరస్ గురించి అతిగా స్పందిస్తున్నారే తప్ప పెద్దగా భయపడాల్సిన పనిలేదని.. ఇదో ప్రహసనమంటూ షాపుల ముందు ఆందోళన చెందుతున్న సాటి కస్టమర్లకు సూచిస్తున్నారని టెక్సాస్ ట్రిబ్యూన్ తెలిపింది. (నివురుగప్పిన నిప్పులా వుహాన్ )
ఇక కొన్ని కొన్ని స్టోర్లలో ఉష్ణోగ్రతలు పరీక్షించకుండానే కస్టమర్లను లోపలికి అనుమతిస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది. కాగా రాష్ట్రంలో కరోనా మరణాలు 816కు చేరిన క్రమంలో గవర్నర్ గ్రెగ్ అబాట్ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి తగ్గిన కారణంగా స్టోర్లు తిరిగి ప్రారంభించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేగాక దీర్ఘకాలం పాటు మూసి ఉన్న షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే షాపులోకి ఒకేసారి అనుమతించే వారి సంఖ్య 25 శాతానికి మించకూడదని ఆయన షరతు విధించారు. కానీ ఈ విధంగా కేవలం పావు శాతం మందిని మాత్రమే లోపలికి అనుమతిస్తే స్టోర్ నిర్వహణకు సరిపడా ఆదాయం కూడా రాదని వ్యాపారులు పెదవి విరుస్తున్నారు.
‘‘మేజర్ స్టోర్లన్నీ మూసే ఉన్నాయి. కాబట్టి ప్రజలు పెద్దగా బయటకు రారు. కానీ గవర్నర్ షాపులు తెరవాలని చెబుతున్నారు. కరోనా వ్యాప్తి తగ్గి.. ప్రజల్లో భయాలు తొలగినపుడు.. 50-70 శాతం మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చినపుడు మాత్రమే మాకు గిట్టుబాటు అవుతుంది. అప్పటిదాకా షాపులు తెరిచినా ఎవరికీ ప్రయోజనం ఉండదు’’అని చెప్పుకొచ్చారు. ఇక కొంతమంది ఉద్యోగులు మాట్లాడుతూ... వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు తమకు కనీస సదుపాయాలు కూడా అందుబాటులో ఉండటం లేదని వాపోతున్నారు. మాస్కులు, శానిటైజర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని.. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం రిస్కే అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు కరోనా నివారణకు టీకా కూడా కనిపెట్టని తరుణంలో ఇలా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయమనడం క్రేజీగా ఉందని మండిపడుతున్నారు. (ఇది నిజంగా ఆశాజనక పరిస్థితి: ట్రంప్)
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష డెమొక్రాట్లు గవర్నర్ గ్రెగ్ అబాట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఎప్పుడైతే టెక్సాన్లు నిర్భయంగా బయటకు వెళ్లి తినడం, షాపింగ్ చేయడం, ఉద్యోగాలకు వెళ్లడం చేస్తారో అప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది. అంతేగానీ వారి అభీష్టానికి వ్యతిరేకంగా వెళ్తే సాధారణ పరిస్థితులు నెలకొనడానికి చాలా కాలం పడుతుంది’’అంటూ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. కాగా షాపులు తెరచుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ. నార్డ్‌స్టార్మ్, సెఫోరా, యాపిల్, చికోస్ అంగ్ జేల్స్ ఇంతవరకు తెరవకపోవడం గమనార్హం
Comments
Please login to add a commentAdd a comment