తన్నుకుంటే.. తగ్గిస్తారు..
సాధారణంగా ఖైదీల సత్ప్రవర్తనను చూసి, వారి జైలు శిక్షను తగ్గించడం లేదా విడుదల చేయడం వంటివి చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఇదే. కానీ.. థాయ్‌లాండ్‌లోని క్లాంగ్‌ప్రెమ్ సెంట్రల్ జైలులో మాత్రం అంతా రివర్స్. ఇక్కడ ఖైదీలు వేరొకరిని చితక్కొడితే.. జైలు శిక్షను తగ్గిస్తారు! నిజ్జంగా నిజం. ఇక్కడ ఖైదీలు తమ జైలు శిక్షను తగ్గించుకోవాలనుకున్నా.. పెరోల్ కావాలనుకున్నా జైలులో జరిగే కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటారు. విదేశీ కిక్‌బాక్సర్లపై విజయం సాధిస్తే.. వారి కోరిక నెరవేరినట్లే. అందుకే ఈ సెంట్రల్ జైలులో నిర్వహించే ‘ప్రిజన్ ఫైట్’కు తెగ డిమాండ్ ఉంటుంది. ఇందుకోసం ఖై దీలు కిక్ బాక్సింగ్‌ను నేర్చుకుంటారు. ఈ పోటీల్లో గెలుపొందితే.. వారికి ప్రైజుమనీని ఇవ్వడంతోపాటు అధికారులు జైలు శిక్షను కొంతకాలం తగ్గిస్తారు.
అయితే.. ఈ శిక్ష తగ్గింపు ఎవరికిపడితే వారికి ఇవ్వరట. జైలులో మంచిగా ఉన్నవారికే అవకాశమట. 2013 జనవరిలో ఈ తరహా పోటీలు ప్రారంభమయ్యాయి. ఎందుకిదంతా అంటే.. 1774లో థాయ్‌లాండ్ వీరుడు నాయ్ ఖనోంటోమ్ బర్మా జైలులో ఉన్నప్పుడు అక్కడి రాజు ఆదేశానుసారం ఇలాగే 9 మంది వీరులను ఓడించి.. జైలు నుంచి విడుదల పొందాడట. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వీరిక్కడ ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.