
ఆ 'డ్రస్' చూపులకు స్పందిస్తుంది
అందమైన అమ్మాయిలు అలా వెళుతుంటే...కొంటె చూపులు చూసే కుర్రాళ్ల మనుసును దోచే మగువల అత్యాధునిక డ్రెస్ ఇది...
కాలిఫోర్నియా: అందమైన అమ్మాయిలు అలా వెళుతుంటే...కొంటె చూపులు చూసే కుర్రాళ్ల మనుసును దోచే మగువల అత్యాధునిక డ్రెస్ ఇది. అలా చూసే వారు మగవాళ్లా, ఆడవాళ్లా, వారి వయస్సెంతా ? అన్న అంశాలనే కాకుండా వారు ఈ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని ఎక్కడ చూస్తున్నారో, ఏ పార్ట్‌ను చూస్తున్నారో కూడా ఈ డ్రెస్ ఇట్టే కనిపెట్టేస్తుంది. ఆ చూపుకు అనుగుణంగా వెంటనే స్పందిస్తుంది. అలా స్పందించేందుకు ఈ డ్రెస్‌లో సంకోచ వ్యాకోచ గుణాలు ఉన్నాయి. చూపు పడిన చోట వ్యాకోచిస్తుంది.
ఈ డ్రెస్‌ను ఓ ప్రత్యేక 3డీ ప్రింటర్ ద్వారా అమెరికాకు చెందిన బెహనాజ్ ఫరాహి అనే డిజైనర్ తయారు చేశారు. ఈ డ్రెస్‌ను చర్మం కన్న సున్నితమైన ఫ్యాబ్రిక్‌ను ఉపయోగించి తయారు చేసినట్టు దక్షిణ కాలిఫోర్నియాలో ఇంటరాక్షన్ డిజైనింగ్‌లో పీహెచ్‌డీ చేస్తున్న ఫరాహి తెలిపారు. దీనికి ‘కేరెస్ ఆఫ్ ది గేజ్’ అని నామకరణం కూడా చేశారు. చూపురుల చూపులను పసిగట్టేందుకు డ్రెస్‌లో ఓ రహస్య కెమేరాను అమర్చి దాన్ని మైక్రో కంట్రోలర్‌తో అనుసంధించారు. ధరించిన వారి చర్మం ప్రవర్తన బట్టి కూడా స్పందించి వారికి హాయినిచ్చే విధంగా కూడా డ్రెస్ ఉంటుందని, అందుకోసం అనుగుణమైన ఫ్యాబ్రిక్‌నే వాడామని ఫరాహి తన వెబ్‌సైట్‌లో వివరించారు.
ఈ డ్రెస్‌లో ఉపయోగించిన టెక్నాలజీ మరీ కొత్తదేమీ కాదు. పరిసరాలను అనుగుణంగా స్పందించే డ్రెస్‌ను ఇంతకుముందు చైనీస్ ఫ్యాషన్ డిజైనర్ యిన్ గావో సృష్టించారు. చూపులకు స్పందించే గుణం, చూసేవారి వయస్సును కూడా కచ్చితంగా గుర్తించే గుణం తన డ్రెస్‌కు మాత్రమే ఉందని ఫరాహి చెబుతున్నారు. ఏ క్షణమైనా తాను ఇలాంటి డ్రెస్‌లను మార్కెట్‌లోకి విడుదల చేయవచ్చని చెప్పారు. ధర ఎంతుంటో మాత్రం వెల్లడించలేదు.