ఓ శృంగార పురుషుడి ‘జ్ఞాపకాలు’
అలనాటి హాలీవుడ్ శృంగారతార మార్లిన్ మన్రో ఇచ్చిన ఓ ముద్దు అతని జీవిత ధ్యేయాన్నే నిర్దేశించింది. నిత్యం శృంగారకేళీ విలాసాల్లో విహరిస్తూ ఏకంగా శృంగార సామ్రాజ్యాన్నే నెలకొల్పి రేరాజులా వెలిగిపోతున్నాడు. అతనే అమెరికాకు చెందిన 68 ఏళ్ల డెన్నీస్ హాఫ్. అర్థరాత్రి ప్రసారమయ్యే హెచ్‌బీవో ఛానల్ రియాలిటీ షోలో కనిపిస్తూ గొప్ప సెలబ్రిటీ అయ్యాడు. ఇప్పుడు సామాజిక వెబ్ సైట్లలోనూ కనువిందు చేస్తున్నాడు. తన ప్రేమపురాణాన్ని పుస్తకరూపంలో తీసుకొస్తున్నాడు. వ్యభిచారిణులతో తన సాంగిత్యాన్ని జ్ఞాపకాల రూపంలో వివరిస్తున్న ‘ది ఆర్ట్ ఆఫ్ ది పింప్’ పుస్తకాన్ని మార్చి 17న మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాడు. అప్పుడే తన పుస్తకం బుకింగ్‌లు మొదలయ్యాయని చెబుతున్నాడు.
డెన్నీస్ 1990లో నేవడ రాష్ట్రంలోని లియాన్ కౌంటీలో రూ. 6 కోట్లకు ఓ వ్యభిచార గృహాన్ని కొనుగోలు చేశాడు. దానికి అనుబంధంగా బార్లు, రెస్టారెంట్లు, క్యాసినోలను నెలకొల్పుతూ శృంగార సామ్రాజ్ఞాన్ని విస్తరించాడు. ఇప్పుడు ఆయన సామ్రాజ్యంలో ఏ క్షణమైనా 200 మందికి పైగా వ్యభిచారిణులు అందుబాటులో ఉంటారట. మగువల మనసెరిగిన వాడిని కావడంతో.. వారికి విటులను ఎంచుకోవడం దగ్గరి నుంచి లావాదేవీలు మాట్లాడుకోవడం వరకు అన్ని విషయాల్లో స్వేచ్ఛ కల్పించానని చెప్పాడు. వారికి సీఎల్స్, సిక్ లీవ్‌లు ఇవ్వడమే కాకుండా, వారు సంపాదించిన సొమ్ముతో బార్లు, రెస్టారెంట్లు, ఇతర సంబంధిత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించానని, తన కంపెనీల్లో వాటాలిచ్చానని తెలిపారు. ఇంతకు...డెన్నీస్‌కు మార్లిన్ మాన్రో ఎప్పుడు, ఎక్కడ ముద్దు పెట్టింది?...ఆమె ఆరిజోనా స్టేట్ ఫేర్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్‌కి వచ్చినప్పుడు ఎనిమిదేళ్ల వయస్సులో తనను ముద్దు పెట్టుకొందని, ఆదీ తన బుగ్గ మీదని డెన్నీస్ తన పుస్తకంలో వివరించాడు. అయినా ఆ ముద్దును ఇప్పటికీ మరువలేదని చెప్పాడు.
అమెరికాలో చట్టబద్ఢంగా వ్యభిచారాన్ని అనుమతిస్తున్న ఏకైక రాష్ట్రం నేవడ. రాష్ట్రంలో మొత్తం 16 కౌంటీలు ఉండగా, ఎనిమిది కౌంటీల్లో మాత్రమే ఇప్పటి వరకు వ్యభిచారాన్ని నిషేధించారు. మిగతా కౌంటీల్లో కూడా నిషేధించే ప్రయత్నాలు జరిగాయి. వీటి వల్ల సామాజిక నష్టం ఉందని వాదించేవాళ్లు, సాంస్కృతికంగా ఈ వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఉందని, రేప్‌లు లాంటి అసాంఘిక సంఘటనలు జరుగకుండా వ్యభిచార గృహాలు తోడ్పడుతున్నాయని వాదించేవాళ్లు ఎన్నోసార్లు కోర్టులకెక్కారు. చివరకు వ్యభిచారాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టే తీర్పు చెప్పడంతో ప్రస్తుతం ఎలాంటి వాదనలు పెద్దగా వినిపించడం లేదు.