తోక చుక్కల పేలుడు వల్లే చంద్రుడిపై మచ్చలు
న్యూయార్క్: నిండు చందమామను చూస్తే ఎవరికైనా ఆనందమే. ముఖ్యంగా చంద్రుడిపై కొన్ని ప్రకాశవంతమైన మచ్చలు (గుర్తులు) అందరినీ ఆకట్టుకుంటాయి. ఆ ప్రాంతం మరింతగా తెల్లగా మెరుస్తుంది. అయితే ఆ ప్రకాశవంతమైన మచ్చలు చంద్రుడిపై ఎందుకు ఉన్నాయి అనే అంశంపై ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా దీనికి కారణం కనుగొన్నారు బ్రౌన్ యూనివర్సిటీ పరిశోధకులు. దాదాపు వంద మిలియన్ సంవత్సరాల క్రితం చంద్రుడి ఉపరితలంపై వేల కొలది తోక చుక్కలు పేలిపోవడం వల్ల ఆ ప్రాంతంలో ప్రకాశమంతమైన గుర్తులు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
చంద్రుడిపై ఉన్న మట్టి మీద కంప్యూటర్ మోడళ్లను ఉపయోగించి తోకచుక్కల నమూనాలను ప్రయోగించారు. ఈ ప్రయోగంలో చాలా వరకు చంద్రుడిపై ఉన్న మచ్చలను పోలిన గుర్తులు ఉండడాన్ని గమనించారు. దీని ద్వారా తోకచుక్కల విధ్వంసం వల్లే ఈ గుర్తులు ఏర్పడినట్లు నిర్ధరించారు. చంద్రుడిపై ఉన్న మచ్చల విషయంలో ఇప్పటివరకు అనేక పరిశోధనలు, వివాదాలు ఉన్నాయి. వేల కిలోమీటర్ల పొడవున చంద్రుడిపై ఈ కాంతి గుర్తులు కనిపిస్తాయి. ఈ గుర్తులు కలిగి ఉన్న రియెనర్ గామా అనే ప్రాంతాన్ని టెలిస్కోప్ ద్వారా స్పష్టంగా చూడవచ్చు.