ఒబామా షియానా, సున్నీనా? | The 'Obama is a Muslim' conspiracy theory is still reverberating in the Middle East | Sakshi
Sakshi News home page

ఒబామా షియానా, సున్నీనా?

Published Fri, Jan 22 2016 8:15 PM | Last Updated on Thu, Apr 4 2019 4:25 PM

ఒబామా షియానా, సున్నీనా? - Sakshi

ఒబామా షియానా, సున్నీనా?

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దేశ రాజకీయాల్లోకి వచ్చిన దశాబ్దం కాలం నుంచి ఆయన ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన సున్నీ తెగకు చెందిన ముస్లిం అని, కాదు షియా తెగకు చెందిన ముస్లిం అంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి ఇప్పటికి కూడా తెరపడలేదు. ఒబామాకు షియా ముస్లిం మూలాలు ఉండడం వల్లనే ఇరాన్‌తో అమెరికాకు అణు ఒప్పందం కుదిరిందన్న ప్రచారం తాజాగా ఊపందుకొంది.

దశాబ్దాలుగా ఇరాన్‌తో అణ్వస్త్రాల అంశం వివాదాస్పదంగా ఉండగా, గత జూలై నెలలోనే ఇరాన్‌తో అమెరికాకు అణు ఒప్పందం కుదిరింది. ఈ కారణంగా ఇరాన్‌పై కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు వైట్‌హౌజ్ ఇటీవల ప్రకటించింది. ఇరాన్‌తో అణు ఒప్పందానికి కూడా షియాలు ఎక్కువగా ఉన్న ఇజ్రాయెల్ తోడ్పడిందని దుబాయ్ జనరల్ సెక్యూరిటీ అధిపతి దాహి ఖల్ఫాన్ తమీమ్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇరాన్‌లోని షియా ప్రాంతాలను ఒబామా త్వరలో పర్యటించే అవకాశం కూడా ఉందని ఆయన అన్నారు. తమీమ్ అనామక వ్యక్తేం కాదు. దుబాయ్ మాజీ పోలీసు చీఫ్. ఆయనకు ట్విట్టర్ ఖాతాలో 12 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన ఒబామా గురించి చేసే వ్యాఖ్యలను వేలాది మంది షేర్ చేసుకుంటారు.

 ఒబామాకు షియా నేపథ్యం ఉండడం వల్లనే ఇరాన్‌తో అణు ఒప్పందం కుదిరిందని ఇరాకి పార్లమెంట్ సభ్యుడు తహా అల్ లాహిబీ కూడా ఆ మధ్య ఆన్‌లైన్ వీడియోలో  వ్యాఖ్యానించారు. అదే సమయంలో సిరియా రచయిత ముహిద్దీన్ లజికాని లండన్‌కు చెందిన అల్ హివర్ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడుతూ ఒబామా కెన్యాలోని షియా మతస్థుడికి పుట్టిన కొడుకని అన్నారు. ఒబామా మధ్య పేరు హుస్సేన్ అని, ఆ పేరు షియా ముస్లింల గురువదని, అందుకే షియా ముస్లింలు ఎక్కువ మంది హుస్సేన్ అని పేరు పెట్టుకుంటారని అన్నారు. వాస్తవానికి సున్నీలు, ముస్లిం ఏతరులు కూడా ఎక్కువ మంది హుస్సేన్ పేరు పెట్టుకుంటారు.
 ఒబామా తల్లితో విడిపోయిన తండ్రి కెన్యాకు చెందిన ముస్లిం అని, ఆ తర్వాత ఆయన హేతువాదిగా మారారన్న వాదన ఉంది. సున్నీలు ఎక్కువగా ఉండే కెన్యా మూలాలు ఉన్నందున ఒబామా సున్నీ తెగకు చెందిన ముస్లిం అన్న ప్రచారమూ జరిగింది.

ఒబామా తల్లి ఇండోనేసియాకు చెందిన సున్నీని రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నేళ్లపాటు ఒబామా ఆ దేశంలోనే ఉన్నందున ఆయనకు సున్నీ మూలాలు ఆన్నాయనే వాదనా ఉంది. ఇండోనేసియాలో ఒబామా తొలుత క్రిస్టియన్ స్కూల్లో, ఆ తర్వాత ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నారు. ఇలాంటి ప్రచారం ఎక్కడిదాకా వెళ్లిందంటే ఒబామా ఉత్తర్వుల కారణంగా ఇస్లాం స్టేట్ సున్నీ తీవ్రవాదులకు అమెరికా మద్దతు ఇస్తోందని ఇరాక్‌లో ఎక్కువ మంది ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇది ముమ్మాటికి నిజమేనని ఇరాక్ షియా ప్రైవేట్ సైన్యం కమాండర్ ముస్తఫా సాది మీడియా ముందు ఆరోపించారు.


ఒబామా షియా ముస్లిం అని, కాదు సున్నీ అని నిరూపించేందుకు కొందరు అరబిక్ సోషల్ మీడియాలో నకిలీ వీడియోల ద్వారా ప్రచారం కూడా చేశారు. అమెరికన్లలో కూడా ఒబామా ముస్లిం అని నమ్మేవారు ఎక్కువగానే ఉన్నారు. 2014లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం రిపబ్లికన్లలో 54 శాతం మంది ఒబామాను ముస్లిం అని విశ్వసిస్తున్నారు. ఏదేమైనా ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ఆఫ్రికన్-అమెరికన్ అనే స్థానానికి మాత్రం ఢోకా రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement