వందకోట్ల మంది ఖతం! | The study of Nebraska University scientists on Nuclear bomb blast | Sakshi
Sakshi News home page

వందకోట్ల మంది ఖతం!

Published Tue, Jul 18 2017 3:29 AM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM

వందకోట్ల మంది ఖతం!

వందకోట్ల మంది ఖతం!

- అణుబాంబు పేలితే వచ్చే విపత్తు..
నెబ్రాస్కా యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం
 
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమా, నాగసాకిపై పేలిన అణుబాంబులు ఎంతటి విధ్వంసం సృష్టించాయో మనందరికీ తెలుసు. అయితే అప్పటికీ ఇప్పటికీ టెక్నాలజీలో ఎంతో మార్పు వచ్చింది. అణ్వస్త్రాలు మరింత శక్తిమంతమయ్యాయి. విధ్వంసక శక్తి కూడా ఎన్నో రెట్లు ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో యూనివర్సిటీ ఆఫ్‌ నెబ్రాస్కా లింకన్‌ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం జరిపారు. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఒక్క అణుబాంబు పేలితే వచ్చే ఫలితాలపై విశ్లేషించారు. అధ్యయన ఫలితాలు చూస్తే.. ఎవరికైనా వెన్నులో భయం పుట్టాల్సిందే..! చైనా వద్ద ఉన్న ఐదు మెగాటన్నుల అణుబాంబు ఒక్కటి పేలితే.. భూ వాతావరణంలోకి దాదాపు లక్షల టన్నుల బ్లాక్‌ కార్బన్‌ చేరిపోతుంది.. ఇది సూర్యరశ్మిని అడ్డుకుని భూమ్మీద వెలుతురును తగ్గిస్తుంది.

ప్రాంతాన్ని బట్టి వర్షాలు 20 నుంచి 80 శాతం వరకూ తగ్గిపోతాయి. ఐదేళ్ల పాటు పంటలు పండే కాలంలో పది నుంచి 40 రోజులు తగ్గిపోతాయి. ఈ మేరకు దిగుబడులూ తగ్గిపోవడంతో ప్రపంచమంతా కరువు అలుముకునే ప్రమాదం ఉంది. ఈ విపరీత వాతావరణ పరిస్థితులన్నింటి దృష్యా ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద కోట్ల మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని నెబ్రాస్కా లింకన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
అంచనా ఇలా..
అణ్వస్త్ర ప్రభావాన్ని అంచనా వేసేందుకు నెబ్రాస్కా శాస్త్రవేత్తలు గతంలో చేసిన ఒక ప్రయోగాన్ని ఆధారంగా చేసుకున్నారు. భూమి మీద అణ్వస్త్ర ప్రేరేపిత శీతల పరిస్థితులు రావాలంటే దాదాపు 1,300 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అణుబాంబుల ప్రభావానికి గురికావాల్సి ఉంటుంది. హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబుల సామర్థ్యం 15 కిలోటన్నులు కాగా.. దాని ప్రభావం 13 చదరపు కిలోమీటర్ల ప్రాంతంపై పడింది. అంటే అలాంటివి వంద బాంబులు కావాలన్న మాట.

అయితే ఇప్పుడు వివిధ దేశాల వద్ద ఇంతకంటే బలమైన అణ్వాయుధాలు చాలానే ఉన్నాయి. చైనా వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన అణుబాంబు సామర్థ్యం 5 మెగాటన్నులు. ఇలాంటిది ఒక్కటి పేలినా భూమ్మీద చీకట్లు కమ్ముకోవడం ఖాయమంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ అంచనాలు పూర్తిగా నిజమయ్యేందుకు అవకాశాలు తక్కువే. ఎందుకంటే అణ్వస్త్రం ద్వారా బ్లాక్‌ కార్బన్‌ లాంటి పదార్థాలు ఎంత మేరకు భూవాతావరణంలోకి చేరతాయన్న దానిపై స్పష్టత లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement