
జీ20లో మోదీ వివరాలు లీక్
లండన్: ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో గత ఏడాది జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన భారత ప్రధాని నరేంద్రమోదీ సహా 31 మంది ప్రపంచ దేశాల అగ్రనేతల వ్యక్తిగత వివరాలను అజాగ్రత్తగా లీక్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. సదస్సుకు హాజరైన అగ్రనేతల పేరు, పుట్టిన తేదీ, జాతీయత, పాస్‌పోర్ట్ నంబరు, వీసా నంబరు తదితర వివరాలతో కూడిన ఈ-మెయిల్‌ను.. ఆస్ట్రేలియా వలస విభాగంలోని ఒక ఉద్యోగి పొరపాటుగా.. ఆసియాన్ కప్ స్థానిక నిర్వహణ కమిటీ సభ్యుడు ఒకరికి పంపినట్లు గార్డియన్ దినపత్రిక తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. మోదీతో పాటు, అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రిటన్ ప్రధాని కామెరాన్ తదితర 31 దేశాల నేతల వివరాలు ఈ ఈ-మెయిల్‌లో ఉన్నాయి. దాన్ని అందుకున్న వ్యక్తి తక్షణమే తెలియజేయటంతో ఈ విషయాన్ని ఆస్ట్రేలియా వలస విభాగం ఉన్నతాధికారులకు నివేదించగా.. ఆ ఈ-మెయిల్ మరెవరికీ వెళ్లకుండా చర్యలు చేపట్టారు.
ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన లీక్ కాదని.. దీనివల్ల ఉత్పన్నమయ్యే పెద్ద సమస్యలు ఏవీ ఉండవని.. కాబట్టి ఈ విషయాన్ని ఆయా నేతలకు తెలియజేయాల్సిన అవసరం లేదని వలస విభాగం పేర్కొనటంతో మోదీ సహా ఆయా దేశాల నేతలు ఎవరికీ తెలియజేయలేదు.