
విధ్వంసం తప్పదేమో!
పారిస్ నరమేధం అనంతరం చోటుచేసుకున్న ఎన్ కౌంటర్లతో కథ ముగిసిపోలేదని అమెరికన్ రక్షణ సంస్థలు వెల్లడించాయి.
- 'పారిస్' ముష్కరులతో కలిసి వచ్చిన వచ్చిన మరో 40 మంది జిహాదీలు ఇంకా యూరప్ లోనే
- దాడుల ముప్పు ఇంకా తొలిగిపోలేదన్న అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీలు
వాషింగ్టన్: పారిస్ నరమేధం అనంతరం చోటుచేసుకున్న ఎన్ కౌంటర్లతో కథ ముగిసిపోలేదని, నాటి దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదులతో కలిసివచ్చిన మరో 40 మంది జిహాదీలు ఇంకా యూరప్ లోనే ఉన్నారని అమెరికన్ రక్షణ సంస్థలు వెల్లడించాయి.
ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ మహ్మద్ అల్ అద్నానీ ఆదేశాలమేరకు పలు నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు 60 మంది జిహాదీలు గతేడాది నవంబర్ లోనే యూరప్ లోకి ప్రవేశించారని, బృందాలుగా విడిపోయిన జిహాదీల్లో 20 మంది పారిస్ దాడుల అనంతరం హతంకాగా, ఆయా ప్రాంతాల్లో నక్కిన మిగతా జిహాదీలు ఏ క్షణమైనా విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఆయా దేశాలకు హెచ్చరికలు కూడా పంపాయి.
'పశ్చిమాసియాలో విధ్వంసానికి ప్రతీకారంగా దాడులు జరుపుతామని ఐఎస్ చీఫ్ అబూ అహ్మద్ ఏడాది కిందటే యూరప్ ను హెచ్చరించాడు. ఆ మేరకు నరమేధం సృష్టించేందుకు 60 మంది జిహాదీలు లండన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియంలోని రెండు ముఖ్యపట్టణాలకు చేరుకున్నారు. నవంబర్ 13న పారిస్ దాడుల అనంతరం వారిలో 20 మంది చనిపోయారు. మిగిలిన ఉగ్రవాదులు ఎప్పుడైనా విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది' అని అమెరికా సెక్యూరిటీ ఏజెన్సీలు పేర్కొన్నాయి. పక్కాగా అందిన సమాచారం మేరకే తాము ఈ ప్రకటన చేస్తున్నామన్న ఏజెన్సీలు తెలిపాయి.