Cat Burglar
న్యూజిల్యాండ్: ఇళ్ళల్లోకి చొరబడి బంగారం, నగలు ఎత్తుకుపోయేవాళ్ళను చూశాం. బ్యాంకుల్లో, కార్యాలయాల్లో డబ్బు, వస్తువులు చోరీ చేసేవాళ్ళను చూశాం. అయితే ఓ దొంగ విచిత్ర వస్తువుల చోరీకి పాల్పడుతోందట. తరచుగా ఇళ్ళల్లో మిస్సవుతున్న ఆ వస్తువులు ఎవరు దొంగిలిస్తున్నారో తెలియక అంతా తలలు పట్టుకుంటుంటే చివరికి ఆ దొంగే ఓరోజు వస్తువులన్నీయజమాని ఇంటికి తెచ్చి పెట్టేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందట. ఇంతకూ ఆ టక్కరి దొంగ ఏ వస్తువులను కొట్టేసిందనేగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నది?... ఎందుకాలస్యం ఈ స్టోరీ చదివెయ్యండి....
న్యూజిల్యాండ్ హామిల్టన్ లో బర్గ్లర్ అనే ఓ పిల్లి.. తరచుగా అందరి ఇళ్ళల్లో చోరీకి పాల్పడుతోందట. అయితే పిల్లి చోరీ చేస్తోందంటే ఏ పాలో, పెరుగో అనుకునేరు. సాక్షాత్తూ ఆ ఇళ్ళల్లోని మగవాళ్ళ అండర్ వేర్లు, సాక్స్ లు తస్కరిస్తోందట. ఇళ్ళల్లో లో దుస్తులు అదృశ్యం అవుతుంటే ఇంట్లోవాళ్లకు అవి ఎలా పోతున్నాయో అర్థం కాకుండా పోయిందట. ఏ డబ్బో, బంగారమో అయితే కేసులు పెట్టడమో, ఫిర్యాదు చేయడమో చేస్తారు. ఈ చోరీ అటువంటిది కాదుకదా... పోతున్నది లో దుస్తులు కావడంతో ఏం చేయాలో పాలుపోక ఆలోచనలో పడ్డారట. రెండు నెలల్లో ఆరేళ్ళ వయసున్న ఆ టాంకినీస్ క్యాట్.. మొత్తం పదకొండు జతల అండర్ వేర్లు, ఏభై వరకూ సాక్స్ చోరీ చేసి, తిరిగి తెచ్చి యజమాని ఇంట్లో పెట్టేయడంతో చివరికి అసలు విషయం బయట పడింది.
ఈ సరదా న్యూస్ ను 'మీరు అండర్ వేర్లు పోగొట్టుకున్నారా?' అన్న టైటిల్ తో ఫేస్ బుక్ వినియోగదారుడు సారా నాథన్ ఫొటోలతో సహా పోస్ట్ చేశాడు. ఆ దొంగ పిల్లిని గురించి జనాన్ని అప్రమత్తం చేసేందుకు తానా వివరాలను అందిస్తున్నట్లు చెప్పాడు. అందుకోసం వీధుల్లోని ప్రతి లెటర్ బాక్స్ లోనూ నోట్ పెట్టానని, జార్జి సెంటర్ ప్రాంతంలోని వారెవరైనా సదరు ఆస్తులు పోగొట్టుకుంటే తనకు తెలియజేయాలని ఫేస్ బుక్ లో రాశాడు. ఇంకెదుకాలస్యం మరి తమ తమ ... దుస్తులు పోగొట్టుకున్నవారు త్వర పడాల్సిందే...