
చూశారంటే ప్రేమలో పడతారు!
నేటి రోజుల్లో చాలామంది నిజమైన ప్రేమ లేదనే అంటుంటారు. అంతా అవసరాలు, సౌకర్యాలకోసం ఏర్పాటుచేసుకునే బంధాలే తప్ప బాధ్యతలు, భావోద్వేగాలు వాటిల్లో లేవని అంటుంటారు.
న్యూయార్క్: నేటి రోజుల్లో చాలామంది నిజమైన ప్రేమ లేదనే అంటుంటారు. అంతా అవసరాలు, సౌకర్యాలకోసం ఏర్పాటుచేసుకునే బంధాలే తప్ప బాధ్యతలు, భావోద్వేగాలు వాటిల్లో లేవని అంటుంటారు. కానీ, న్యూయార్క్లో మాత్రం ఓ వృద్ధ జంటను చూస్తే నిజంగా ప్రేమంటే ఇదేరా అనుకోకతప్పదేమో.. అది న్యూయార్క్లోని ఓ విమానాశ్రయప్రాంగణం. అందరూ తమతమవారికోసం ఎదురుచూస్తున్నారు. చేతిలో సెల్ఫోన్ అందులోనే ముఖాలు.
కానీ, ఓ పెద్దాయన మాత్రం హుందాగా తయారై చేతిలో పూలబొకే పట్టుకుని ఎంతో ఆత్రంగా ఓపికతో ఏమాత్రం అసహనం లేకుండా ఎయిర్ పోర్ట్ ప్రవేశ ద్వారం వైపు చూస్తున్నాడు. ఇంతలో ఓ సిల్వర్ రంగు జుట్టున్న పెద్దావిడ బయటకు వచ్చింది. ఆయన ముఖంలో చిరునవ్వులు.. ఆమె ముఖంలో చిరునవ్వులు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆవిడ ఆయనను చేరి ఒక్కసారిగా హత్తుకుపోయింది. గాఢంగా ముద్దుపెట్టుకొంది. ఆ క్షణంలో అక్కడ ఉన్నవారంతా వారిని చూసి ఓ క్షణంపాటు కదలకుండా ఉండిపోయి వారిని చూస్తూ నిండైన ప్రేమలో మునిగిపోయారు. ఈ వీడియోను క్రిస్ జీక్యూ పెర్రీ అనే సంగీత దర్శకుడు యూట్యూబ్లో మంగళవారం పెట్టగా ఇప్పటికే దాదాపు 22 మిలియన్ల మంది వీక్షించారు.