పెళ్లికి అప్పిస్తారు కానీ..
వంద అబద్ధాలాడయినా ఓ పెళ్లి చేయమంటారు. అంటే వివాహ బంధానికి అంతటి ప్రత్యేకత ఉందన్నమాట. అందుకే కాబోలు స్వాన్ లవ్ పేరిట ఓ కంపెనీ ఏకంగా పెళ్లిళ్ళకు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది... కానీ నిర్వాహకులు దానికి కొన్ని కండిషన్లు మాత్రం పెట్టారు. అప్పు తీసుకున్నవారు వివాహ బంధాన్ని సజావుగా కొనసాగించారా సరి... విడాకులకు సిద్ధపడ్డారో అంతే.. తీసుకున్న డబ్బును వడ్డీతో కలిపి అణాపైసాలతో సహా చెల్లించాల్సిందే..
ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు పెళ్లి చేసుకోడానికి అష్ట కష్టాలు పడుతుంటారు. అధిక వడ్డీరేట్లను చెల్లించి అప్పులపాలౌతుంటారు. అటువంటివారితో పాటు.. ప్రేమ జంటలకూ ఆర్థికంగా అండగా నిలిచేందుకు వినూత్న ఆలోచనతో సీటెల్ లోని స్వాన్ లవ్ కంపెనీ ముందుకొచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి పెళ్లి చేసుకోవాలనుకుంటే వారికి పదివేల డాలర్లను సహాయంగా ఇస్తుంది. అయితే వారి కాపురం సజావుగా సాగిందా ఫర్వాలేదు. తీసుకున్న అప్పునుంచీ ఒక్క పైసా కూడ తిరిగి చెల్లించాల్సిన అవసరరం లేదు. ఒకవేళ విడాకులకు దారి తీసిందంటే మాత్రం... అప్పుతీసుకున్ననాటినుంచీ వడ్డీతో సహా చెల్లించాల్సిందే. అందుకు ఎంత వడ్డీ కట్టాలి అన్నది కంపెనీ ముందుగానే నిర్ణయిస్తుంది. చట్టబద్ధమైన నిబంధనలతో కూడిన డాక్యుమెంట్లపై సంతకాలు కూడ చేయించుకుంటుంది. కంపెనీ పెట్టే షరతులన్నింటికీ ఒప్పుకుంటేనే డబ్బును ఇచ్చేందుకు ఆ జంటను ఎంపిక చేస్తారు.
స్వాన్ లవ్ సీఈవో స్కాట్ యావీకి ఈ వినూత్న ఆలోచన తన స్నేహితుడి పెళ్లి సందర్భంలో వచ్చిందట. ఇది క్రేజీగానే ఉన్నా ఆచరించడానికి ఎంతో ఆనందంగా ఉందంటున్నాడతడు. ఓ వ్యవస్థను రక్షించేందుకు ఈ విషయాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నానని, వివాహ జీవితంలో అసమానతలు చోటు చేసుకున్నపుడు రుణభారం ఒక్కరిపైనే పడుతోందని, అంతేకాక సమాన బాధ్యతలు పంచుకొని సమస్యలను అధిగమిస్తారనే ఆలోచనతోనే ఈ విధానాన్ని పరిచయం చేస్తున్నామని స్కాట్ సావీ చెప్తున్నారు. అయితే తమ కంపెనీకి ఇన్వెస్టర్లు వస్తారా లేదా అన్నవిషయం ఇంకా తేలలేదన్నారు.
ఇప్పుడిప్పుడే ధరఖాస్తులు స్వీకరిస్తున్న సంస్థ... అనుకున్నట్లుగా అన్నీ జరిగితే ఫిబ్రవరినాటికి చెల్లింపులు ప్రారంభించే అవకాశం ఉంది. అయితే కంపెనీకి రాబడి వచ్చేందుకు చాలా సంవత్సరాలు పట్టొచ్చని, భవిష్యత్తులో లాభదాయకంగా నడిచే అవకాశం ఉందని స్కాట్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. వ్యక్తుల ప్రవర్తనలు, ఆలోచనలను ఆధారంగా చేసుకుని వ్యాపారం చేయడం స్కాట్ కు ఇదే మొదటిసారి కాదు. మొబైల్ యాప్ కంపెనీ అటాక్ టచ్, యాప్ అనలిటిక్స్ కంపెనీ... వై స్లైడ్స్, స్నాప్ డేర్ స్నాప్ ఛాట్ వంటివెన్నో స్థాపించాడు. అయితే ఇప్పుడు వీటన్నింటికీ భిన్నంగా... పూర్తిగా వివాదాస్పదమైన స్వాన్ లవ్ సంస్థను స్థాపించి బిజినెస్ మోడల్ గా నిలుస్తున్నాడు. భవిష్యత్తులో వివాహాలు విచ్ఛిన్నం అవుతాయన్న గట్టి నమ్మకంతోనే అతడీ సంస్థను స్థాపించాడన్న విమర్శలూ వస్తున్నాయి. ఇది వ్యక్తుల జీవితాలతో వ్యాపారం చేయడం కాదా అని స్కాట్ ను అడిగితే మాత్రం... తాను పరిశీలించినంతలో ఇప్పటివరకూ సానుకూల స్పందనే ఉందని చెప్తున్నాడు.