
రష్యా రైల్వే స్టేషన్‌లో అద్భుత సాహసం
రష్యాలోని ఓ సీసీటీవీ కెమెరాలో అద్భుత దృశ్యం రికార్డయింది. ఫోన్లో మాట్లాడుతూ అనూహ్యంగా రైలు పట్టాలపై పడిన ఓ పిల్లాడిని అక్కడే ప్లాట్‌ఫాం పై ఉన్న ఓ వ్యక్తి ఎంతో తెగువ చేసి రక్షించాడు.
మాస్కో: రష్యాలోని ఓ సీసీటీవీ కెమెరాలో అద్భుత దృశ్యం రికార్డయింది. ఫోన్లో మాట్లాడుతూ అనూహ్యంగా రైలు పట్టాలపై పడిన ఓ పిల్లాడిని అక్కడే ప్లాట్‌ఫాం పై ఉన్న ఓ వ్యక్తి ఎంతో తెగువ చేసి రక్షించాడు. అది కూడా రైలు వస్తుండగా ప్రాణాలకు తెగించి. వారిద్దరు ప్లాట్‌ఫాం చేరుకున్న సెకన్లలోనే రైలు వచ్చి వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని యేకతరిన్‌బర్గ్ రైల్వే స్టేషన్‌లో ఓ ఎనిమిదేళ్ల బాలుడు చేతిలో ఫోన్ బ్యాగుతో ఉండి ప్లాట్‌ఫాం చివరి అంచున నడవడం మొదలుపెట్టాడు.
దిక్కులు చూస్తూ తాను ఎక్కడ అడుగువేస్తున్నాననే విషయాన్ని ఆదమరిచి అమాంతం రైలుపట్టాలపై పడ్డాడు. కాస్త దూరంలో హైస్పీడ్ రైలు దూసుకొస్తుంది. ఏ ఒక్కరూ దిగే సాహసం చేయలేదు. కానీ, అక్కడే ఉన్న ఓ నల్లజాతీయుడు ప్రాణాలకు తెగించి రైలుపట్టాలమీదకు దూకాడు. ఆ బాలుడిని పైకెత్తి వేరేవాళ్లకు అందించాడు.
అ తర్వాత తాను కూడా పైకి వచ్చి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. అతడు అలా పైకి వచ్చి రాగానే రైలు వేగంగా వచ్చి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ బాలుడి తండ్రితోపాటు అక్కడి వారంతా సోషల్ మీడియాలో ఆ బ్లాక్ యువకుడిని పొగడ్తల్లో ముంచెత్తారు. తాను అతడు ఎక్కడున్నా కలుసుకొని ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నట్లు బాలుడి తండ్రి తెలిపాడు.