వింత దొంగను పట్టుకున్నారు...
టోక్యోః జపాన్ లోని టోక్యోలో ఓ వింత దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ ఫేస్ బుక్ ఖాతాలోకి అక్రమంగా చొరబడి, ఆమె లోదుస్తుల ఫోటోలను డౌన్లోడ్ చేసిన ఆరోపణలతో పోలీసులు ఆ వ్యక్తిని వలవేసి పట్టుకున్నట్లు తెలిపారు. వందలకొద్దీ అక్రమ ఖాతాలు, పాస్వర్డ్స్ సేకరించిన అతడి ఇంట్లో సోదాలు జరిపి డేటాను కూడ స్వాధీనం చేసుకున్నారు.
ఓ మహిళ లో దుస్తుల ఫొటోలను అక్రమంగా దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్లు చేశారు. జపాన్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి, 25 ఏళ్ళ ర్యోసుకే కొగా.. బాధితురాలి ఫేస్ బుక్ ఖాతాలోకి చొరబడి, జనవరినుంచి మూడు నెలల సమయంలో సుమారు 17 సార్లు అక్రమంగా లాగిన్ అయ్యాడు. అంతేకాక ఆమె ఖాతానుంచి లోదుస్తుల ఫోటోలను డౌన్లోడ్ చేశాడని టోక్యో మెట్రోపాలిటన్ పోలీస్ అధికారులు వెల్లడించారు. ఐటీ సంస్థలో పనిచేస్తున్నసదరు వ్యక్తి సుమారు 770 ఫేస్ బుక్, ఐ క్లౌడ్ ఐడీలు కలిగి ఉన్నట్లు, వాటినుంచీ సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు స్థానిక మీడియా సహా, జిజి ప్రెస్ విచారణలో వెల్లడైంది.
అక్రమంగా సామాజిక మాధ్యమాల్లో చొరబడి, సమాచారాన్ని దొంగిలిస్తున్న కొగాకు మూడేళ్ళ జైలు శిక్షతోపాటు, సుమారు 5.5 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అన్ని వందల లాగిన్ ఐడీలను.. కొగా ఎలా సేకరించాడన్న విషయాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఓ మహిళ అండర్ వేర్ ఫొటోలను డౌన్లోడ్ చేసిన సందర్భంలో ఆ చోరాసురుడి అసలు బండారం బయట పడినట్లు ఓ వార్తా పత్రిక వెల్లడించిన సమాచారంద్వారా తెలుస్తోంది. ఇతరుల అకౌంట్లలో చొరబడ్డమే కాక, కొన్నిలైంగిక చిత్రాలను పోస్టు చేసిన కొగా ఇంట్లో... సోదాలు నిర్వహించిన పోలీసులు.... అతడు సేకరించిన ఐడీ, పాస్వర్డ్ డేటాను కూడ స్వాధీనం చేసుకున్నారు.