
60 మీటర్ల ఎత్తులో గంటన్నర పాటూ..
సరదాగా గడిపేందుకు విహారయాత్రకు వచ్చిన పర్యాటకులకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం యాంగ్జోహూ పారడైజ్లోని ఫెర్రిస్ వీల్ తిరుగుతుండగా ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో అందులో కూర్చున్న 138 మంది యాత్రికులు గాల్లోనే గంటన్నరపాటూ ఉండాల్సి వచ్చింది. అందులో నుంచి ఎటూ కదలలేని పరిస్థితితో పాటూ అసలు ఏం జరిగిందో తెలియక పోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన తూర్పు చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్లోని యాంగ్జోహూ పారడైజ్ అమ్యూజ్మెంట్ పార్క్లో చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలం చేరుకొని దాదాపు 60 మీటర్ల ఎత్తులో ఇరుక్కు పోయిన యాత్రుకులను సురక్షితంగా రక్షించారు.
గంటన్నరపాటూ గాల్లోనే ఉండటంతో కళ్లు తిరగడంతో పాటూ ఛాతిలోనొప్పి కూడా వచ్చిందని ఓ పర్యాటకురాలు ఆవేదన వ్యక్తం చేసింది. విద్యుత్ అంతరాయంతో సమస్య తలెత్తినట్టు నిర్వాహకులు తెలిపారు. 2015 అక్టోబర్లో ప్రారంభించిన యాంగ్జోహూ పారడైజ్ అమ్యూజ్మెంట్ పార్క్ జియాంగ్సూ ప్రావిన్స్లోనే అతిపెద్దది. బాధితుల టికెట్ రుసుమును తిరిగి ఇవ్వనున్నట్టు యాజమాన్యం తెలిపింది.