ఫ్రెండ్ని చంపి.. ఎంత తెలివిగా తరలించారో
మత్తుపదార్ధాల వినియోగం ఎంతటి విపరీతానికి దారి తీస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది కుటుంబాన్ని నాశనం చేస్తుంది. బంధాలను బాధిస్తుంది.. దోస్తులను విడదీస్తుంది. ప్రాణాలు బలితీసుకుంటుంది. అమెరికాలో ప్రిస్టన్ లే ఫీల్డ్(19, టైలర్ మిరాబెల్లి(22), అమందా వేదా (20), జోషువా రోస్(19) అనే నలుగురు మంచి స్నేహితులు. ఎటువెళ్లినా కలసి వెళ్లేవారు. బాగా ఎంజాయ్ చేసేవారు. ఎప్పుడు ఏం కోరుకుంటే ఆ పని చేసే వరకు నిద్రపోయేవారు కాదు. అలాంటి మిత్రులకు ఒక పాడు అలవాటు అయింది. అదే డ్రగ్స్ వినియోగం.
తక్కువ వయసులోనే డ్రగ్స్కు బానిసలైన వీరు రోజు అదే పనిలో నిమగ్నమవుతుండేవారు. ఒక రోజు జోషువా రోస్కు డ్రగ్స్ ఓవర్ డోస్ అయింది. అతడు దాదాపు స్పృహకోల్పోయాడు. దీంతో తీవ్రం భయాందోళనకు లోనైన ఇద్దరు మిత్రులు మరో స్నేహితురాలు అతడిని తమ వాహనంలో ఎక్కించుకొని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, వారికి సమీపంలో ఎక్కడా ఒక్క ఆస్పత్రి కూడా కనిపించలేదు. దీంతో మరింత కంగారు పడి దుర్మార్గంగా ఆలోచించారు. అతడి ముఖానికి ఓ నల్లటి కవర్ను తగిలించి ఓ వైరును గొంతుకు బిగించి చంపేశారు.
అనంతరం ఆ మృతదేహాన్ని తమ ప్రాంతంలో అయితే గుర్తుపడతారని తాము నడుపుతున్న ట్రక్కులో ముందు సీట్లో కూర్చొబెట్టి ఎవరికీ అనుమానం రాకుండా తలకు టోపీ, చక్కగా కళ్ల జోడు పెట్టి ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ వదకు తీసుకెళ్లి ఫిల్ చేయించుకున్నారు. అనంతరం సస్కెహన్నా అనే ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్ వెంబడి ఉన్న అడవుల్లో అతడి మృతదేహాన్ని పడేసి తిరిగి తమకేం తెలియదన్నట్లుగా వచ్చేశారు. దాదాపు ఐదురోజులపాటు విచారణ జరిపిన పోలీసులు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించి చివరకు వారిని అరెస్టు చేశారు. మితిమీరిన డ్రగ్స్ తీసుకోవడం వల్ల స్పృహకోల్పోయిన తమ మిత్రుడి విషయం వాళ్లింట్లో తెలిస్తే ఏం జరుగుతుందో అనే కంగారులో వారు ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు వివరించారు.