వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అసలు కాక మొదలైంది. ఇండియానా ప్రాథమిక ఎన్నికల తర్వాత పోటీ దారులమధ్య మాటల యుద్ధం షురూ అయింది. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన అనంతరం డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్పై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో అదే స్థాయిలో హిల్లరీ స్పందించారు. ట్రంప్ ఓ చంచల స్వభావి అని, అమెరికా ప్రజలు అతడిని ఎన్నుకునేంత తెలివితక్కువ వారని తాను భావించడం లేదని అన్నారు.
ట్రంప్కు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడం అమెరికాకు సమస్యలు కొనితెచ్చుకోవడమే అని చెప్పారు. ట్రంప్ను ధీటుగా ఎదుర్కోని ప్రచారం ఎలా నిర్వహించాలో తనకు బాగా తెలుసని అన్నారు. అదే సమయంలో.. ట్రంప్ పార్టీలోని రెబల్స్ అతడిపై పైచేయి సాధించలేకపోయారని, ఎందుకంటే అంతకంటే ముందే వారు ట్రంప్తో ఒప్పందం చేసుకున్నారని ఆమె ఆరోపించారు. 'ట్రంప్ ఓ పేలని ఫిరంగి. పేలని ఫిరంగులు ఉపయోగిస్తే అవి మిస్ ఫైర్ అవుతాయి' అని ఆమె విమర్శించారు.
'ట్రంప్ పెద్దపెద్ద ప్రకటనలు చేస్తున్నారు. పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఒక దేశ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నప్పుడు అసలు ప్రజలకు ఏం చేస్తారో అనే విషయం తప్పక చెప్పాలి. ప్రజలకు ఎంత మంచి చేయాలనుకుంటున్నారో.. దానికోసం ఎలా ముందుకు వెళతారో వివరించాలి. స్వతహాగా వ్యాపారస్తుడైన ట్రంప్ కు విదేశాంగ విధానం అస్సలు తెలియదు. అతడిని అధ్యక్షుడికి ఎన్నుకోవడం మాత్రం అమెరికాకు పెద్ద చిక్కే' అని ఆమె చెప్పారు.
ట్రంప్పై హిల్లరీ సంచలన వ్యాఖ్యలు
Published Thu, May 5 2016 8:38 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
Advertisement