ట్రంప్ ప్రభుత్వంలో మరో తెలుగు సంతతి వ్యక్తి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతత వ్యక్తికి తన ప్రభుత్వంలో కీలక పదవిని అప్పజెప్పారు. పెరూ దేశ అమెరికా రాయబారిగా భారతీయ అమెరికన్ కృష్ణా ఆర్ ఉర్స్ ను నియమించారు. అమెరికా దేశ రాయబారిగా 1986 లో కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రస్తుతం స్పెయిన్‌లోని అమెరికా ఎంబసీలో డిప్యూటీ చీఫ్‌గా పనిచేస్తున్నారు.
గత ముప్పై ఏళ్లుగా దక్షిణ అమెరికా దేశాలకు సంబంధించిన ఆర్థిక, అభివృద్ధి విధానాల నిపుణుడిగా కృష్ణా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఇప్పటి వరకు సీనియర్ అధికారిగాను, యూఎస్‌ఏ తరఫున ఏడు దేశాల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఆయన తెలుగు, హిందీతో పాటు స్పానిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.
టెక్సాస్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్‌ను, జార్జిటౌన్ యూనివర్సిటీ నుంచి బీఎస్ డిగ్రీని పొందారు. పెరూకు అమెరికా దౌత్యవేత్తగా కృష్ణను నియమిస్తున్నట్లు వైట్‌హౌస్ అధికారిక ప్రకటన చేసింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగించుకు రాగానే.. భారత సంతతి వ్యక్తికి కీలక పదవి తగ్గడం విశేషం.