వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో జరగనున్న హౌడీ మోదీ కార్యక్రమానికి అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ హాజరవడానికి అంగీకరించడంతో మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా సక్సెస్ అయ్యింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల అధినేతలు ఇద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొంటూ ఉండడంతో అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. హ్యూస్టన్ ర్యాలీలో కీలక ప్రకటనకు అవకాశం ఉందంటూ ట్రంప్ సంకేతాలిచ్చారు. గురువారం కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ వెళుతుండగా ప్రత్యేక విమానంలో విలేకరుల హ్యూస్టన్ ర్యాలీలో ఏదైనా ప్రకటన ఉంటుందా అన్న ప్రశ్నకు ఉండొచ్చునని బదులిచ్చారు. భారత్, పాక్‌ల మధ్య కశ్మీర్ అంశం ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఇలా మాట్లాడడంతో అమెరికా భారత్ పక్షమే వహిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రవాస భారతీయులనుద్దేశించి టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో ఈ నెల 22న మోదీ ప్రసంగించనున్నారు.
వాణిజ్య బంధాల బలోపేతమే మోదీ లక్ష్యం
గత కొద్ది నెలలుగా భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల అమెరికా వాణిజ్య ప్రతినిధి రోబర్ట్ లైటింగర్ భారత్ ఎగుమతులపై కొన్ని ప్రయోజనాలను రద్దు చేశారు. దీనికి ప్రతిగా అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై భారత్ సుంకాలను పెంచింది. ఇలాంటి సమయంలో రెండు దేశాల అధినేతలు ఒకే వేదికను పంచుకోవడం వల్ల రెండు దేశాల మ«ధ్య వాణిజ్య రంగంలో విభేదాలు సమసిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ రాకతో అమెరికా సమాజ ఆర్థిక పురోగతికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషికి గుర్తింపు లభిస్తోందని మోదీ భావిస్తున్నారు. ఇంధన, వాణిజ్య రంగాల్లో సంబంధాలు బలోపేతం అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
ఓటు బ్యాంకు కోసం ట్రంప్
అమెరికాలో నివసించే భారతీయులు ఏర్పాటు చేసిన ఒక ప్రైవేటు కార్యక్రమానికి ట్రంప్ హాజరుకావడం ఇదే తొలిసారి. 2020 అధ్యక్ష ఎన్నికల కోసం ఇప్పటికే సన్నాహాలు చేస్తున్న ట్రంప్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే హాజరవుతున్నారని భావిస్తున్నారు. ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న ఆసియన్ అమెరికన్లలో అయిదో వంతు మంది భారతీయులే. అందులోనూ టెక్సాస్‌లో భారతీయుల ఓటుబ్యాంకు బలంగా ఉంది. 2 లక్షల 70 వేల మందికిపైగా ఓటర్లు టెక్సాస్‌లో ఉన్నారు. హౌడీ మోదీ కార్యక్రమానికి 50 వేల మందికిపైగా ప్రవాస భారతీయులు హాజరుకానున్నారు. అమెరికా ఎన్నికల్లో భారతీయులు సంప్రదాయంగా డెమొక్రాట్లకే మద్దతుగా ఉంటూ వస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంపై రాజకీయంగా రిపబ్లికన్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో డెమోక్రాట్లు పట్టుకు యత్నిస్తున్నారు.
హౌడీ మోదీ కలిసొచ్చేదెవరికి
Published Fri, Sep 20 2019 4:39 AM | Last Updated on Fri, Sep 20 2019 5:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment