ఆమెను అమెరికా నుంచి వెళ్లగొట్టాలి!
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్, రిపబ్లికన్ గవర్నర్ నిక్కీ హెలీపై అదే పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు విద్వేషాన్ని ఎగజిమ్ముతున్నారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు వలసవచ్చే ప్రజల విషయంలో అనుసరిస్తున్న విపరీత ధోరణిని పరోక్షంగా తప్పుబడుతూ నిక్కీ హెలీ వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి వలస వచ్చిన తమ కుటుంబం అమెరికాలో ఎలా స్థిరపడిందో చెప్తూ.. అలా సక్రమంగా అగ్రరాజ్యానికి వలసవచ్చే వారికి భరోసా కల్పించాలిగానీ, అమెరికా తమను గెంటివేస్తుందన్న భావన కలిగించరాదని ఆమె పేర్కొన్నారు.
దేశాన్ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన చివరి ప్రసంగంపై సౌత్ కరోలినా రాష్ట్రం గవర్నర్ అయిన నిక్కీ హెలీ 9 నిమిషాలపాటు తన ప్రతిస్పందన తెలియజేశారు. ఈ సందర్భంగా తన భారత్, అమెరికా మూలాలను ఆమె గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ (వలస) విధానాన్ని సంస్కరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అంతేకానీ అమెరికాకు రాకుండా భయపెట్టేలా ఆగ్రహపూరితమైన ధ్వనులు వినిపించడం సరికాదని పరోక్షంగా ట్రంప్ వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. అలా జరిగితే అమెరికా చట్టాలకు కట్టుబడి ఇక్కడ చిత్తశుద్ధితో ఎవరూ పనిచేయబోరని, అమెరికా తమను స్వాగతించడం లేదన్న భావన వారిలో కలుగుతుందని అన్నారు. అక్రమ వలసను నిరోధిస్తూనే.. అన్ని పత్రాలతో చట్టబద్ధంగా అమెరికాకు వచ్చేవారిని మతం, జాతితో సంబంధం లేకుండా స్వాగతించేలా ఈ విధానం ఉండాలని ఆమె స్పష్టం చేశారు.
పారిస్ దాడుల నేపథ్యంలో అమెరికాకు ముస్లింలు రాకుండా తాత్కాలిక నిషేధం విధించాలని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిక్కీ హెలీ వ్యాఖ్యలు ట్రంప్ మద్దతుదారులకు ఆగ్రహం కలిగించాయి. ట్రంప్ గట్టి సపోర్టర్, టీవీ కామెంటర్ ఆన్ కౌల్టర్ ఏకంగా 'నిక్కీ హెలీని అమెరికా నుంచి ట్రంప్ వెళ్లగొట్టాలి' అని ట్విట్టర్‌లో అన్నారు. అదేవిధంగా ట్రంప్ మద్దతుదారులు పలువురు సోషల్ మీడియాలో నిక్కీకి వ్యతిరేకంగా విద్వేష పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు.