
వాషింగ్టన్: ఉత్తర కొరియా సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని చైనాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. వచ్చే నెలలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం కానున్న నేపథ్యంలో ట్రంప్ మాటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘ఉత్తర కొరియా సరిహద్దులో చైనా భద్రతను పెంచాలి. ఆ దేశంతో సమావేశం ముగిసే వరకు భద్రతను కట్టుదిట్టం చేయాలి. ఉత్తర కొరియా సమావేశం విజయవంతంగా ముగుస్తుందని కోరుకుంటున్నాను’ అని ఆయన సోమవారం ట్వీట్ చేశారు. కాగా ఆయన ట్వీట్‌లో చైనా-ఉత్తరకొరియా సరిహద్దు సమస్యల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. జూన్ 12న కిమ్‌తో సింగపూర్‌లో సమావేశం కానున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఉత్తర కొరియా ప్రధాన వ్యాపార భాగస్వామిగా చైనా కొనసాగుతోంది.
ట్రంప్ ట్వీట్‌పై చైనా విదేశాంగ మంత్రి స్పందిస్తూ.. తమ దేశం ఎప్పుడూ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేరుస్తుందన్నారు. అలాగే పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తుందని తెలిపారు. ఇతర దేశాలతోవ్యాపార సంబంధాలు కొనసాగిస్తూనే భద్రత విషయంలో దృఢంగా ఉంటామని తెలిపారు. కాగా గతవారం ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ఉత్తర కొరియాతో సమావేశం ఏర్పాటులో చైనా తోడ్పాటు మరువలేనిదని పొగిడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment