ట్రంప్‌ స్టాంపు పడింది! | Trump's first executive order aims to scrap Obamacare | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ స్టాంపు పడింది!

Published Sun, Jan 22 2017 2:17 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ఓవల్‌ కార్యాలయంలో ఫైలుపై తొలి సంతకం చేస్తున్న కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ - Sakshi

ఓవల్‌ కార్యాలయంలో ఫైలుపై తొలి సంతకం చేస్తున్న కొత్త అధ్యక్షుడు ట్రంప్‌

ఒబామాకేర్‌ రద్దు ఫైలుపై అమెరికా అధ్యక్షుడి తొలి సంతకం
వాషింగ్టన్‌: ‘అమెరికా ఫస్ట్‌’ నినాదంతో ప్రమాణ స్వీకారం నుంచే తన ఉద్దేశాన్ని స్పష్టంగా చాటిన అధ్యక్షుడు ట్రంప్‌.. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష ప్రారంభించారు. మాజీ అధ్యక్షుడు ఒబామా తీసుకొచ్చిన ఆరోగ్య చట్టం ‘ఒబామా కేర్‌’ నిబంధనలు సడలిస్తున్న ఫైలుపైనే తొలి సంతకం చేయటం ద్వారా పాలనలో తన ముద్రను చాటుకునే ప్రయత్నం చేశారు. ‘నా ప్రభుత్వ పాలనా విధానాల ప్రకారం ఈ (హెల్త్‌కేర్‌ చట్టం) నిర్ణయాన్ని రద్దుచేయాలని నిర్ణయించాం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం పూర్తవగానే వైట్‌హౌస్‌లోని ఓవల్‌ కార్యాలయానికి వెళ్లి∙ఈ ఫైలుపై సంతకం చేశారు.

‘ఒబామాకేర్‌ వల్ల వివిధ ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ చెప్పారు. దీంతోపాటు ఇరాన్, ఉత్తర కొరియాల నుంచి ముప్పును దృష్టిలో ఉంచుకుని కొత్త మిసైల్‌ భద్రత వ్యవస్థను రూపొందించుకోనున్నట్లు సంకేతాలిచ్చారు. వైట్‌హౌజ్‌ వెబ్‌సైట్లో శక్తి, విదేశాంగ విధానం, ఉద్యోగాలు, అభివృద్ధి, మిలటరీ, చట్టాల అమలు, వాణిజ్య ఒప్పందాలు అనే విధానాలనుంచారు.

మీడియా.. వాస్తవాలు తెలుసుకో!
2009లో ఒబామా బాధ్యతలు చేపట్టగానే కార్యాలయం నుంచి తొలగించిన మాజీ బ్రిటీష్‌ ప్రధాన మంత్రి విన్‌స్టన్‌ చర్చిల్‌ విగ్రహాన్ని ట్రంప్‌ తన కార్యాలయంలో పెట్టించారు. ఆఫీసులో మార్పులు చేశారు. ఒబామా పెట్టించిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ విగ్రహాన్ని వార్తలు రావటంతో దీన్ని ఖండిస్తూ విగ్రహం ఆఫీసులోనే ఉన్న చిత్రాన్ని  ప్రెస్‌ సెక్రటరీ  ట్వీట్‌ చేశారు. ‘మీడియా ప్రమాదాన్ని గుర్తుచేస్తూ తొలి ట్వీట్‌. ముందు వాస్తవాలు తెలుసుకోండి’ అని ట్విటర్లో హెచ్చరించారు.

పెరిగిన ట్విటర్‌ ఫాలోవర్లు
ప్రమాణరం చేసిన 12 గంటల్లోనే ట్రంప్‌కు 1.4 కోట్ల మంది ట్విటర్‌ ఫాలోవర్లు పెరిగారు. 2009లో ట్విటర్‌ ఖాతా ప్రారంభించిన ట్రంప్‌ ప్రస్తుత ఫాలోవర్లు 2.1 కోట్లమంది. దీనికి తోడు అమెరికా అధ్యక్ష ట్విటర్‌ హ్యాండిల్‌ కూడా ఒబామా నుంచి ట్రంప్‌కు బదిలీ అయింది.

ట్రంప్‌ ప్రసంగంపై విమర్శలు
ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్రంప్‌ చేసిన చేసిన ప్రసంగంపై విమర్శలు పెరిగాయి. బ్యాట్‌మన్‌ చిత్రంలో విలన్‌ బేన్‌లా ట్రంప్‌ మాట్లాడారని పలు మీడియా సంస్థలు విమర్శించాయి. మరోవైపు, ట్రంప్‌ ప్రమాణ స్వీకారాన్ని నిరసిస్తూ.. ఆందోళన చేపట్టిన వారిలో 200 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. నిరసన మితిమీరి పోలీసులపై రాళ్ల దాడితోపాటు పలు దుకాణాలపై దాడులకు దారితీయటంతో రాజధాని వాషింగ్టన్‌ డీసీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులకు గాయాలవగా పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి.

భార్యతో కలసి స్టెప్పులు
శుక్రవారం రాత్రి.. భార్య మెలనియాతో కలిసి ట్రంప్‌ స్టెప్పులేశారు. బాధ్యతలు స్వీకరించాక లిబర్టీ బాల్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్‌ పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్, పలువురు ట్రంప్‌ టీమ్‌ కీలక సభ్యులు కుటుంబాలతో సహా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఫ్రీడమ్‌ బాల్, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ బాల్‌ కార్యక్రమాల్లో ట్రంప్‌ దంపతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement