న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా 2,50,000 మంది ప్రాణాలు విడువగా రెండు చిన్న దేశాలు మాత్రం ప్రాణాంతక వైరస్ బారినపడిన వారిలో మరణాల రేటును సమర్ధవంతంగా నిరోధించగలిగాయి. ఖతార్, సింగపూర్‌లలో కరోనా పాజిటివ్ కేసుల్లో మరణాల రేటు కేవలం 0.1 శాతంగా నమోదవడం గమనార్హం. ఆసియాలో అత్యధిక కేసులు నమోదైన దేశాలైన సింగపూర్‌లో ఈ వారాంతంలో 102 సంవత్సరాల మహిళ ప్రాణాంతక వైరస్‌తో పోరులో విజయం సాధించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయా దేశాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మహమ్మారిని దీటుగా ఎదుర్కోవడం ఇందుకు కారణమని వైద్యారోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఖతార్‌లో వైరస్ మరణాల రేటు 0.07గా నమోదవడం వైద్య నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. 16,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదైన ఖతార్‌లో కేవలం 12 మరణాలే చోటుచేసుకున్నాయి. సింగపూర్‌లో 19,000 కేసులు నమోదు కాగా మరణాల రేటు 0.09 శాతానికే పరిమితమైంది.
ఇరు దేశాలు వారి జనాభా పరంగా చూస్తే మరణాల రేటును దాదాపు ఒకే స్ధాయిలో దీటుగా నిలువరించగలిగాయి. వైరస్ సోకిన వారిలో ఆ దేశాలు తమ ప్రతి లక్ష జనాభాలో మరణాల రేటును 0.5 శాతం కంటే తక్కువకే కట్టడి చేయగలిగాయి. కాగా ఇరు దేశాలు ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఒకటవడంతో టెస్ట్ కిట్లు, ఆస్పత్రుల బెడ్స్ వంటి వైద్యారోగ్య మౌలిక సదుపాయాల్లో మెరుగ్గా ఉండటం కూడా వైరస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు ఉపకరించాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖతార్, సింగపూర్‌ల తర్వాత బెలార్, సౌదీ అరేబియా, యూఏఈ కూడా వైరస్ మరణాలను మెరుగ్గా నియంత్రించగలిగాయి. అయితే మరణాల రేటును తక్కువగా చూపుతోందని బెలారస్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి.
చదవండి : ఇకపై మద్యం హోం డెలివరీ..ఇవిగో టైమింగ్స్
మరోవైపు మరణాల రేటు తక్కువగా ఉన్న దేశాల్లో టెస్టింగ్‌లు విస్తృతంగా చేపట్టడం, జనాభా సగటు వయసు, ఐసీయూల సామర్థ్యం వంటివి కీలక అంశాలుగా ముందుకొచ్చాయని యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్‌వేల్స్‌లో గ్లోబల్ బయోసెక్యూరిటీ ప్రొఫెసర్ రైనా మలింట్రే చెప్పారు. వైరస్‌ను ముందుగా పసిగట్టి అత్యధికంగా తొలి దశలోనే టెస్టింగ్‌లు జరిపిన దేశాల్లో మరణాల రేటు తక్కువగా ఉందని ఆమె విశ్లేషించారు. వయసు మళ్లిన జనాభా అధికంగా ఉండి ఐసీయూ సామర్థ్యం తక్కువగా ఉన్న దేశాల్లో అత్యధిక మరణాలు చోటుచేసుకున్నాయని అన్నారు. ఖతార్‌తో పోలిస్తే సింగపూర్‌లో వయసు మళ్లిన వారు, మధ్యవయస్కులు అధికంగా ఉన్నా వైరస్‌కు గురైన వారు అధికంగా తక్కువ వేతనాలు పొందే విదేశీ కార్మికులని, వీరంతా యువకులు కావడం, దేశంలోకి రాగానే వారికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో వైరస్‌ను గుర్తించడం సులువైంది.
Comments
Please login to add a commentAdd a comment