ఫుజైరా(యూఏఈ): యూఏఈలో భాగమైన ఫుజైరా తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో జరిగిన విద్రోహక దాడుల్లో తమ రెండు చమురు నౌకలు ధ్వంసం అయ్యాయని సౌదీ అరేబియా సోమవారం తెలిపింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రతిష్టంభన ఫలితంగా ఇప్పటికే కాస్త ఆందోళనగా ఉన్న గల్ఫ్ ప్రాంతంలో తాజా దాడులు ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ఈ దాడిపై యూఏఈ ఆదివారమే ఓ ప్రకటన చేస్తూ తమ ఫుజైరా తీరం దగ్గర్లో వివిధ దేశాలకు చెందిన 4 వాణిజ్య చమురు నౌకలపై విద్రోహక దాడులు జరిగినట్లు తెలిపింది.
తమ 2 ట్యాంకర్లు ధ్వంసం అయ్యాయనీ, ప్రాణనష్టం సంభవించలేదని సౌదీ ఇంధన శాఖ మంత్రి ఖలీద్ చెప్పారు. సౌదీ నౌకలపై దాడిని ఇరాన్ ఖండించింది. ఈ ప్రాంతంలో సముద్ర తీర భద్రతకు భంగం కలిగించేలా విదేశాలు దుందుడుకు చర్యలకు దిగకుండా జాగ్రత్తగా ఉండాలని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ చమురును ఎవరూ కొనకుండా అమెరికా ఆంక్షలు విధించగా, ఈ ఆంక్షలు ఈ నెల 1 నుంచి అన్ని దేశాలకూ వర్తిస్తూ పూర్తిస్థాయిలో అమల్లోకి రావడం తెలిసిందే. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక బీ–52 బాంబర్లను మోహరించడం ద్వారా తన సైనిక శక్తిని పెంచుకుంది. ఇరాన్‌తో అణు ఒప్పందం విషయంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా చూడాలంటూ అమెరికాను సోమవారం యూరప్ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment