మెక్సికోః ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో క్యాబ్ సేవలతో ప్రయాణీకులకు దగ్గరైన ఉబెర్.. ఇంతకు ముందే అత్యాచార ఘటనతో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంది. తాజాగా మెక్సికో నగరంలో ఓ మహిళా ప్రయాణీకురాలిని అత్యాచారం చేసి, ఆమెనుంచి డబ్బులు కూడా దోచేసిన ఉబెర్ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనతో ఉబెర్ క్యాబ్ లు అంటేనే మహిళలు భయపడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రయాణీకులకు అందుబాటులో సేవలు అందిస్తున్న ఉబెర్ మరోసారి వివాదంలో పడింది. మెక్సికో నగరంలో ఉబెర్ క్యాబ్ లో ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవర్...ఆత్యాచారానికి పాల్పడటమే కాక ... ఏకంగా ఆమె వద్ద ఉన్న డబ్బను కూడ లూటీ చేయడం ఉబెర్ ప్రయాణీకుల్లో ఆందోళన రేపుతోంది. మే 2వ తేదీన జరిగిన ఘటనలో కేసుపై విచారించిన స్థానిక క్రిమినల్ జడ్జి.. 4వ తేదీన డ్రైవర్ కు జైలు శిక్ష విధించడంతో ఆదివారం అతడ్ని వరోనిల్ నార్టె జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
రెస్టారెంట్లు, నైట్ క్లబ్ లకు ప్రసిద్ధి చెందిన మెక్సికో నగరంలో కండెసా డెవలప్మెంట్ బార్ నుంచి బయటకు వచ్చిన బాధితురాలు.. తన గమ్యానికి చేరేందుకు ఉబెర్ కారును ఆశ్రయించింది. కారులో ఎక్కిన ప్రయాణీకురాలిని దారి తప్పించిన మార్గ మధ్యంలో కారు ఆపి, డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక, ఆమె పర్సును లాక్కొని, కారునుంచి బయటకు గెంటేసి పరారయ్యాడు. దీంతో బాధితురాలు ఉబెర్ డ్రైవర్ ఘాతుకాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడ్ని గుర్తించేందుకు బార్ యజమానిని విచారించారు. బార్ వద్దనే మహిళ క్యాబ్ ఎక్కడంతో యజమాని ఉబెర్ డ్రైవర్ ను గుర్తిచగలిగాడు. దీనికి తోడు సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడ పోలీసులు పరిశీలించారు. కొద్ది గంటల్లోనే నిందితుడ్ని గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు కేసుపై విచారణ జరిపి జైలుకు పంపించారు.
మహిళపై ఉబెర్ డ్రైవర్ ఘాతుకం.. అరెస్ట్!
Published Mon, May 9 2016 12:34 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement
Advertisement