రిషి సునక్
లండన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ధాటికి బ్రిటీషు పాలకులు విలవిల్లాడుతున్నారు. కోవిడ్-19 ఎప్పుడు ఎవరిని సోకుతుందోనని భయాందోళన చెందుతున్నారు. యువరాజు చార్లెస్‌తో పాటు ప్రధాని బోరిస్ జాన్సన్, ఆరోగ్యశాఖ మంత్రి మట్ హన్‌కాక్ ఇప్పటికే కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ప్రపంచ నాయకుల్లో కరోనా సోకిన మొదటి నేతగా బోరిస్ జాన్సన్ నిలిచారు. బోరిస్ జాన్సన్ కేబినెట్‌లోని మంత్రులకు కరోనా వ్యాపించే అవకాశాలున్నాయని స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గత కొద్దిరోజులుగా తన మంత్రివర్గ సహచరులతో కలిసి వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారికి కరోనా ముప్పు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నేషనల్ హెల్త్ సర్వీస్ సిబ్బందిని అభినందిస్తూ గురువారం రాత్రి చప్పట్లు కొడుతున్న రిషి, జాన్సన్
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతికి చెందిన రాజకీయ వేత్త రిషి సునక్ కూడా బోరిస్ జాన్సన్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి లక్షణాలేవి ఆయనలో కనబడలేదని బీబీసీ రిపోర్ట్ చేసింది. తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సిన అవసరం లేదని, ‘రెండు మీటర్ల సామాజిక దూరం’ నియమాన్ని పాటిస్తున్నట్టు రిషి సునక్ వెల్లడించారు. నేషనల్ హెల్త్ సర్వీస్ సిబ్బందిని అభినందిస్తూ గురువారం రాత్రి ప్రధాని జాన్సన్‌తో కలిసి ఆయన చప్పట్లు కొట్టారు. అయితే అప్పుడు ప్రధానికి ఆయన రెండు మీటర్ల దూరంలో నిలుచున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వంలో రిషి సునక్ కీలక భూమిక పోషిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు, అనేక వర్గాలకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహయం ప్రకటించడంలోనూ ఆయన చురుగ్గా పనిచేస్తున్నారు.
క్వీన్‌ను ప్రధాని కలవలేదు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాణి ఎలిజిబెత్‌ను గత కొన్ని వారాలుగా ప్రధాని బోరిస్ జాన్సన్ కలవలేదని బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారి ప్రతినిధి ధ్రువీకరించారు. మార్చి 11న చివరిసారిగా భేటీ జరిగిందని వెల్లడించారు. కోవిడ్ భయంతో తర్వాత నుంచి ఫోన్‌లోనే రాణితో ప్రధాని సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. సాధారణంగా ప్రతివారం క్వీన్ ఎలిజిబెత్‌ను ప్రధాని కలిసేవారు. కాగా, తన అధికారిక నివాసం నుంచే సాంకేతికత సాయంతో పరిపాలనను పర్యవేక్షిస్తానని స్వీయ నిర్బంధంలో ఉన్న బోరిస్ జాన్సన్ శుక్రవారం ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఒకవేళ ఆయన ఆరోగ్య పరిస్థితి సహకరించకుంటే విదేశాంగ మంత్రి డొమినిక్ రామ్ తాత్కాలికంగా ప్రధానమంత్రిగా వ్యవహరిస్తారని స్థానిక మీడియా పేర్కొంది. (బ్రెజిల్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు)
ఒక్కరోజే 2,885 కరోనా పాజిటివ్ కేసులు
తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు బ్రిటన్‌లో 14,543 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 163 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం ఒక్కరోజే 2,885 కేసులు వెలుగులోకి వచ్చాయి. 759 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడిన వారిలో 135 మంది కోలుకున్నారు. (కరోనాపై గెలుపు: ఇటలీలో అద్భుతం)
Comments
Please login to add a commentAdd a comment