
నేడు నిరుద్యోగం ప్రపంచ సమస్య
వాషింగ్టన్: ప్రస్తుతం ప్రపంచంలో మూడొంతుల మంది యువతీ యువకులే ఉన్నారు. అంటే దాదాపు 180 కోట్ల మంది యువత ఉద్యోగం చేస్తూగానీ, శిక్షణ పొందుతూగానీ లేదా చదువుకుంటూగానీ ఉన్నారు. వచ్చే దశాబ్దం కాలం నాటికి వందకోట్ల మంది యువతుకు ఉద్యోగావకాశాలు కావాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలను పరిగణలోకి తీసుకుంటే వారిలో 40 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. మిగతా 60 శాతం మందికి ఉద్యోగావకాశాలు ప్రస్తుత అంచనాల ప్రకారం లేవు. వీరందరికి ఉద్యోగాలు రావాలంటే మరో పదేళ్ల నాటికి ప్రపంచంలో 60 కోట్ల ఉద్యోగాలు, అంటే నెలకు 50 లక్షల ఉద్యోగాలను కొత్తగా సృష్టించాల్సి ఉంది.
మరి, ఇన్ని ఉద్యోగాలను కొత్తగా సృష్టించడమంటే అంత సులువుకాదు. అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏయే రంగాలకు ప్రధానాత్య ఇవ్వాలి? అన్న అంశాలపై ‘సొల్యూషన్స్ ఫర్ యూత్ ఎంప్లాయిమెంట్ (ఎస్4వైఈ)’ అనే సంస్థ దృష్టిని కేంద్రీకరించి ఓ నివేదికను వెల్లడించింది. ఈ సంస్థ ప్రపంచ బ్యాంక్ గ్రూప్, ప్లాన్ ఇంటర్నేషనల్ యూత్ ఫౌండేషన్, ర్యాండ్, ఆక్సెంచర్, యూత్ బిజినెస్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్‌లతో కలసి ఓ గ్రూప్‌గా పనిచేస్తోంది.
ప్రాంతం, దేశాలనుబట్టి పరిస్థితులు మార్పున్నప్పటికీ నిరుద్యోగం అన్నది ప్రపంచం సమస్యని, దాదాపు 30 శాతం యువతకు ఉద్యోగాలు దొరకడం భవిష్యత్తులో కష్టమని, ముఖ్యంగా మహిళల పరిస్థితి దారుణంగా ఉండవచ్చని ఆ నివేదిక తెలియజేస్తోంది. నిరుద్యోగం వల్ల సామాజిక అసమానతలు మరింత పెరుగుతాయని, సామాజిక అశాంతి పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది. ఇప్పుడు భవిష్యత్ నిరుద్యోగ సమస్యను ఎలా ఎదుర్కోవాలన్నదే మనందరి ముందున్న ప్రధాన సమస్యని నివేదిక తెలిపింది.
ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీలు కొలాబరేషన్‌తో పనిచేయాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా సంఘర్షణలు కొనసాగుతున్న ప్రాంతాల్లో అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది. నైపుణ్యంగల యువతకు ఉద్యోగాలు రానప్పుడు వారి నైపుణ్యం ఆర్థిక పురోభివృద్ధికి ఉపయోగపడకపోవడమే కాకుండా వారిలో అలజడిని సృష్టిస్తుందని, ఫలితంగా సామాజిక అశాంతి పరిస్థితులు నెలకొనడమే కాకుండా సుస్థిర ప్రపంచ ఆర్థికాభివృద్ధి కూడా దెబ్బతింటుందని నివేదిక అభిప్రాయపడింది.
పెద్దవాళ్లతో పోల్చినట్లయితే యువతలోనే వ్యాపారరంగంలో రాణించాలనే తపన ఎక్కువగా ఉంటుందని, వారికి సంబంధిత ప్రభుత్వాలు, ప్రైవేటు భాగస్వామ్య కంపెనీలు, సామాజిక సంస్థలు చేయూత నివ్వాలని నివేదిక సూచించింది. అలాగే యాజమాన్యంతో కలసి పనిచేయడం వల్ల కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వారిలో ఉండే నూతనోత్సాహం కంపెనీ అభివృద్ధికి దోహద పడుతుందని అభిప్రాయపడింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యోగుల పని విధానంలో, యాజమాని, వర్కర్ల సంబంధాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ఈ రంగంపై కూడా తమ సంస్థ దృష్టిని కేంద్రీకరించిందని తెలిపింది. యువకులతోపాటు యువతులకు సమాన అవకాశాలు ఇవ్వడం, యువత నైపుణ్యాల మధ్యనున్న వ్యత్యాసాన్ని తొలగించేందుకు కూడా తమ సంస్థ కృషి చేస్తోందని చెప్పింది. కొత్త ఉద్యోగావకాశాల కోసం నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు వెళ్లకపోతే 2030 నాటికి ప్రపంచం తీవ్ర నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటుందని నివేదిక హెచ్చరించింది.