రాక రాక ఉద్యోగాల నోటిఫికేషన్లు.. అయినా పుస్తకం రాదు, కుర్చీ ఉండదు! | Khammam: No Facilities In Library For Aspirants Telangana Job Notification | Sakshi
Sakshi News home page

రాక రాక ఉద్యోగాల నోటిఫికేషన్లు.. అయినా పుస్తకం రాదు, కుర్చీ ఉండదు!

Published Wed, May 18 2022 1:11 PM | Last Updated on Wed, May 18 2022 1:20 PM

Khammam: No Facilities In Library For Aspirants Telangana Job Notification - Sakshi

సాక్షి,ఖమ్మం గాంధీచౌక్‌: రాకరాక ఉద్యోగాలకు అవకాశం వచ్చింది. ఎలాగైనా ఫలితం సాధించాలనే లక్ష్యంతో నిరుద్యోగులు శక్తియుక్తులను ప్రయోగిస్తున్నారు. పోటీలో నెగ్గేందుకు పట్టుదలగా ముందుకు సాగుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా వారికి కావాల్సిన పుస్తకాలు లభించక ఇక్కట్లు పడుతున్నారు. ప్రస్తుత పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు జిల్లా గ్రంథాలయంలో అందుబాటులో లేక... మార్కెట్‌లో కొనుగోలు చేసే శక్తి లేక ఆందోళన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గ్రంథాలయంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో చదువు ముందుకు సాగడం లేదని వాపోతున్నారు.

సిద్ధమయ్యేదెలా..
వచ్చేనెలలో వరుసగా పోటీ పరీక్షలు జరగనుండా, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకునేందుకు ప్రతిరోజు 700 మందికి పైగా యువతీ, యువకులు వస్తున్నారు. అయితే, సబ్జెక్టుకు సంబంధించిన తాజా పుస్తకాలు అరకొరగానే ఉండడం, 2016–17కు ముందు సిలబస్‌ పుస్తకాలే ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాజా పుస్తకాలు లేకపోతే పరీక్షలకు ఎలా సిద్ధం కావాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక్కో అభ్యర్థి వ్యయ ప్రయాసలకోర్చి దూర ప్రాంతాల నుంచి ఖమ్మం వచ్చి అద్దె గదుల్లో ఉంటూ చదువుకోవాలని భావించగా గ్రంథాలయంలో పుస్తకాలు లేక పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి జూన్‌ నుంచి వరుసగా పరీక్షలు జరగనుండడంతో కావాల్సిన పుస్తకాలను వెంటనే తెప్పించే ఏర్పాటుచేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

అసౌకర్యాలతో సహవాసం
గ్రంథాలయంలో సరిపడా బెంచీలు, ఫ్యాన్లు లేక, ఉన్న 12 ఏసీల్లో ఒకటే పనిచేస్తుండడంతో ఉక్కపోత నడుమే అభ్యర్థులు చదువుకోవాల్సి వస్తోంది. ఇక బెంచీలు సరిపోకపోవడంతో కొందరు కింద కూర్చుంటుండగా, మరికొందరు ఇళ్ల నుంచి కుర్చీలు తెచ్చుకుంటున్నారు. అలాగే, పురుషులు, మహిళలకు ఒక్కొక్కటే మరుగుదొడ్డి ఉండడంతో క్యూ కట్టాల్సి వస్తోంది. నూతనంగా మరుగుదొడ్లు నిర్మించినా వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇటీవల ఉచిత భోజన వసతి ఏర్పాటుచేసినట్లు ప్రకటించినా.... కొద్దిరోజులకే తొలగించారు. అలాగే, పలు సందర్భాల్లో తాగునీటికి కూడా సమస్య ఎదురవుతోందని చెబుతున్నారు.

జిల్లా గ్రంథాలయం ఎదుట ఆందోళన
ఖమ్మం గాంధీచౌక్‌ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సౌకర్యాలు కల్పించడంతో పాటు అవసరమైన పుస్తకాలు తెప్పించాలనే డిమాండ్‌తో మంగళవారం నిరుద్యోగ యువతీ, యువకులు ఆందోళనకు దిగారు. గ్రంథాలయం ఎదుట ఆందోళనకు దిగిన వారు మాట్లాడుతూ కూర్చోవడానికి బెంచీలు సరిపోకపోగా ఫ్యాన్లు, ఏసీలు కూడా పనిచేయడం లేదని తెలిపారు. దీనికి మరుగుదొడ్ల సమస్య కూడా ఉందని పేర్కొన్నారు. దీంతో గ్రంథాలయ కార్యదర్శి మంజువాణి చేరుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారికి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.

కనీస వసతులు కూడా లేవు..
సివిల్స్‌ కోసం ప్రిపేర్‌ అవుతున్నా. చుట్టాల ఇంట్లో ఉంటూ నిత్యం గ్రంథాలయానికి వస్తుండగా, లేటెస్ట్‌ పుస్తకాలు అందుబాటులో లేవు. రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు అవసరమైన బుక్స్‌ కూడా లభించటం లేదు. దీనికి తోడు మౌలిక వసతులు కూడా సక్రమంగా లేవు.
– అశోక్, కల్లూరు

అవసరమైన పుస్తకాలు తెప్పించాలి
పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు తెప్పించాలి. బయట పుస్తకాలు కొనే స్థోమత లేని వారే గ్రంథాలయానికి వస్తారు. కానీ ఇక్కడ అవసరమైన పుస్తకాలు లేక పోటీ పరీక్షలకు సిద్ధం కాలేకపోతున్నాం. దీనికి తోడు ఇతరత్రా సమస్యలు కూడా అనేకంగా ఉన్నాయి.          
– సుజాత, కాకరవాయి, తిరుమలాయపాలెం మండలం

చదవండి: పోటీ పరీక్షల కోసం.. నిరుద్యోగ యువతకు యాప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement