టోపీలు గాల్లోకి ఎగరేయొద్దు
లండన్: స్నాతకోత్సవం రోజున పట్టభద్రుల పట్టాలు అందుకున్న తర్వాత ఆనందోత్సాహంతో టోపీలు గాల్లోకి ఎగరేస్తుంటారు. ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పెడుతుంటారు. విద్యార్థులు టోపీలు పైకి ఎగరేయడంపై బ్రిటన్ లోని నార్విచ్ లో ఉన్న ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీ(యూఈఏ) నిషేధం విధించింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. గాల్లోకి విసిరిన టోపీలు తగిలి ఇటీవల కాలంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారని విద్యార్థుల దినపత్రిక 'ది ట్యాబ్' తెలిపింది.
ఇలా చేయడం వల్ల గత రెండేళ్లుగా విద్యార్థులు గాయపడుతున్నారని యూనివర్సిటీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. విద్యార్థుల ముఖాలకు గాయాలవుతున్నాయని, గతేడాది ఒక విద్యార్థిని ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. గ్రాడ్యుయేషన్ డే నాడు స్టూడెంట్స్ ఎవరూ గాయలపాలు కాకూడదన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ఫొటోల కోసం విద్యార్థులు అనవసర రిస్క్ చేయకూడదన్న భావనతో నిషేధం విధించినట్టు వివరణయిచ్చారు.