కౌలాలంపూర్: అమెరికా రక్షణ శాఖ సెక్రటరీ యాస్టన్ కార్టర్ గురువారం దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో పర్యటించనున్నారు. ఇటీవల అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యూఎస్ఎస్ థియోడార్ రూజ్వెల్ట్ వివాదాస్పద జలాలలోకి ప్రవేశించడంతో చైనా నావికాదళం దీనిపై ఆగ్రహం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్టర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
కౌలాలంపూర్లో దక్షిణ చైనా సముద్ర సరిహద్దులకు సంబంధించి జరుగుతున్న ఆసియా పసిఫిక్ దేశాల రక్షణ శాఖ అధికారుల సమావేశంలో కార్టర్ పాల్గొన్నారు. అనంతరం దక్షిణ చైనా సముద్రంలోని అమెరికాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను సందర్శించనున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక విధానాన్ని తెలియజేయడంతో పాటు చైనాతో కవ్వింపు చర్యలకు పాల్పడే విధంగా కార్టర్ పర్యటన ఉందని విశ్లేశకులు అభిప్రాయపడుతున్నారు.