భారత్‌కు ఎస్‌టీఏ –1 హోదా | US gives India Strategic Trade Authorisation-1 status | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఎస్‌టీఏ –1 హోదా

Published Wed, Aug 1 2018 3:27 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

US gives India Strategic Trade Authorisation-1 status - Sakshi

వాషింగ్టన్‌: భారతదేశానికి వ్యూహాత్మక రక్షణ, హై టెక్‌ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చే దిశగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశానికి వ్యూహాత్మక భాగస్వామ్య హోదా కల్పించే ‘స్ట్రేటజిక్‌ ట్రేడ్‌ ఆథరైజేషన్‌–1 (ఎస్‌టీఏ –1)’ ప్రతిపత్తిని మంజూరు చేసింది. ప్రధానంగా ‘నాటో’లోని తన మిత్రదేశాలకు మాత్రమే కల్పించే ఈ ప్రతిపత్తిని తాజాగా భారత్‌కు కూడా వర్తింపచేస్తున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్‌ రాస్‌ యూఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్వహించిన ఇండో పసిఫిక్‌ బిజినెస్‌ ఫోరంలో ప్రకటించారు. భారత్‌కు సరఫరా చేసే హైటెక్‌ ఉత్పత్తులపై ఎగుమతి సంబంధిత నియంత్రణలను సడలిస్తున్నామన్నారు. ఎగుమతుల నియంత్రణ విధానంలో.. భారత్‌కు సంబంధించి దీన్నో ముఖ్య మార్పుగా ఆయన అభివర్ణించారు. ఇకపై లైసెన్సుల తాలూకూ బాదరబందీ ఉండబోదని ఆయన చెబుతున్నారు. 2016లో భారత్‌ను తన కీలక రక్షణ భాగస్వామిగా గుర్తించిన అమెరికా.. తదనంతర చర్యగా ఎస్‌టీఏ –1 హోదా మంజూరు చేసింది. ఎస్‌టీఏ –1 కేటగిరీలో చేరిన ఏకైక దక్షిణాసియా దేశం భారత్‌. అమెరికా సన్నిహిత/భాగస్వామ్య దేశాల మాదిరిగా మనం కూడా మరింత అధునాతన టెక్నాలజీని ఆ దేశం నుంచి కొనుగోలు చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది.  

ఆస్ట్రేలియా, జపాన్‌లకు కూడా..
ఎస్‌టీఏ–1 హోదా వల్ల ఎగుమతుల లైసెన్సుల కోసం మన దేశం చేస్తున్న ఖర్చును సగానికి సగం తగ్గించుకోవచ్చునని అమెరికా భారత వాణిజ్య మండలి ప్రతినిధి బెన్‌ షవార్త్‌ వ్యాఖ్యానించారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను సులభతరం చేస్తుందని, ఇరు దేశాల కంపెనీలు ఉమ్మడిగా ఉత్పత్తి/అభివృద్ధి చేసేందుకు వీలు కల్పిస్తుందని చెప్పారు. ఎస్‌టీఏ –1 జాబితాలో  ప్రస్తుతం 36 దేశాలున్నాయి. తాజాగా భారత్‌తో పాటు,  ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాలకు కూడా అమెరికా ఎస్‌టీఏ –1 హోదా ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement