
కూతురు, భార్యతో ప్రముఖ ఫొటో జర్నలిస్టు వెస్లీ బక్సే
మెక్సికో : ఆయన పెద్ద పెద్ద విపత్తులు కళ్లారా చూశారు. చూసిన వాటిని తన కెమెరాలో బంధించి రిపోర్టింగ్ చేశారు. 1985లో వచ్చిన భారీ భూకంపం సమయంలో తీసిన చిత్రాలతో ఒక్కసారి ఉన్నత స్థానానికి వెళ్లి మంచిపేరు తెచ్చుకున్న ఆ ఫొటో జర్నలిస్టు తాజాగా చోటుచేసుకున్న మెక్సికో భూకంపంలో మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు చావుతో పోరాడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. వెస్లీ బక్సే అనే అమెరికా ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన రాయిటర్స్ పత్రికకు పనిచేసే సమయంలో 1985లో భారీ భూకంపం వచ్చింది.
ఆ సమయంలో పలు అద్భుతమైన చిత్రాలు తన కెమెరాలో బందించడంతో ఆయన కెరీర్‌లో దూసుకెళ్లారు. ప్రపంచంలోని ప్రధాని సంఘటనలు జరిగిన ప్రతి చోటకు ఆయనే వెళ్లే వారు. యుద్ధాలకు సంబంధించిన ఫొటోలు కూడా తీశారు. దీంతో ప్రస్తుతం ఆయన టైమ్, న్యూస్ వీక్ సంస్థలకు ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. మెక్సికోలో ఈ నెల (సెప్టెంబర్) 7.1తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో వెస్లీ ఆయన భార్యతో ఇంట్లో ఉన్నారు. భూకంపంకారణంగా వారి అపార్ట్‌మెంట్ కూలిపోయి అందులో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనకు సహాయం చేసేందుకు మిత్రులు గతంలో ఆయన తీసిన చిత్రాలను వేలం పెడుతున్నారు. ఆయనకు ఓ ఐదేళ్ల కూతురు కూడా ఉంది. ఆ పాప స్కూల్‌కు వెళ్లడంతో ఎలాంటి గాయాలవకుండా బయటపడింది.