వాషింగ్టన్ : వందకుపైగా దేశాల్లో వేగంగా విస్తరించిన కరోనా వైరస్(కోవిడ్-19)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూరప్ నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణాలన్నింటినీ 30 రోజులు నిలిపివేసినట్లు బుధవారం ప్రకటించారు. నెల రోజుల పాటు యూరప్ దేశాల నుంచి అమెరికాకు రాకపోకల్ని రద్దు చేశారు. కరోనావైరస్‌ను అడ్డుకునే చర్యల్లో భాగంగానే ఈ తాజా ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ నియంత్రణలు చాలా కఠినమే అయినప్పటికీ, తప్పనిసరి అని చెప్పారు. ‘మన దేశంలోకి మరిన్ని కొత్త కేసులు ప్రవేశించకుండా, రాబోయే 30 రోజుల పాటు యూరప్ నుంచి అమెరికాకు అన్ని రకాల ప్రయాణాలను రద్దు చేస్తున్నాం’ అని ట్రంప్ చెప్పారు. ఈ కొత్త నిబంధనలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. యూకే వ్యాప్తంగా 460 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఇటలీలో వైరస్ విజృంభించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
(చదవండి : కోవిడ్ ప్రపంచవ్యాప్త మహమ్మారి: డబ్ల్యూహెచ్‌ఓ)
అలాగే కరోనాను కట్టడి చేయడంతో యూరప్‌దేశాలు విఫలం చెందాయని ట్రంప్ విమర్శించారు. చైనా నుంచి వచ్చే ప్రయాణాలను కట్టడి చేస్తే యూరప్‌లో కోవిడ్19 ప్రభావం ఇంతగా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. తమ దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు జాగ్రత్తలు చేపట్టామన్నారు. అమెరికాలో గొప్ప శాస్త్రవేత్తలు, మంచి డాక్టర్లు ఉన్నారని, వారంతా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్–19)ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) బుధవారం ప్రకటించింది. పలు దేశాలు ఈ వ్యాధి నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రెస్ అధానొమ్ గెబ్రియేసుస్ బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. చైనా వెలుపల కరోనా కేసులు 13 రెట్లు పెరిగాయన్నారు. సత్వర చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు ఆయన సూచించారు.
(చదవండి : ఇద్దరు ఐటీ ఉద్యోగులకు కరోనా)
యూరప్‌లో ఇప్పటికి వరకు 460 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో ఇప్పటి వరకూ 1135 కేసులు నమోదు కాగా, ఈ వైరస్ సోకిన వారిలో 38 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఇంచుమించుగా లక్షా 18వేలకు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు దాదాపు 4,250 మంది మృతి చెందారు. బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ, ఆరోగ్య శాఖ ఉపమంత్రి నాడీన్ డోరిస్‌కు కోవిడ్ సోకింది. ఈమె గతవారం బ్రిటన్ ప్రధాని, ఇతర ఎంపీలు హాజరైన విందులో పాల్గొన్నారు. దాంతో ఎవరెవరికి వైరస్ సోకిందేమోనన్న ఆందోళన నెలకొంది. చైనాలో కరోనా వైరస్ కాస్త నిలకడగా ఉంటే, ఇరాన్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియాలో పరిస్థితి తీవ్రరూపం దాలుస్తోంది. ఇరాన్‌లో ఒక్కరోజే ఏకంగా 63 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment