వాషింగ్టన్ : ఆసియా దేశాల్లో తొలిసారి పర్యటనకు వస్తున్న అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్, భారత్‌కు ఊసురుమనిపించారు. ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ సందర్శించేబోయే తొలి దేశం భారతే ఉండబోతుందనే ఆశలపై నీళ్లు చల్లారు. నేడు వైట్‌హౌజ్ ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ఆసియా దేశాల పర్యటనలో భారత్ పేరు లేదు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, హవాయి దేశాల్లో ట్రంప్ పర్యటించబోతున్నట్టు వైట్‌హౌజ్ పేర్కొంది. నవంబర్ 3 నుంచి నవంబర్ 14 వరకు ఈ పర్యటన సాగబోతున్నట్టు తెలిపింది. కానీ మనీలాలో జరుగబోయే ఆసియన్ సదస్సులో మాత్రం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ట్రంప్ భేటీ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అమెరికా అధ్యక్షుడితో పాటు నరేంద్ర మోదీ ఈ ప్రాంతీయ సదస్సులో పాల్గొనబోతున్నారు. ఒకవేళ ట్రంప్, మోదీతో సమావేశమైతే, వారిది ఇది మూడో సమావేశం. జూన్‌లో వాషింగ్టన్ డీసీలో, జూలైలో జర్మనీలో జరిగిన జీ-20 సదస్సులో వీరిద్దరి మధ్య భేటీ జరిగింది. ద్వైపాక్షిక, బహుపాక్షిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో ట్రంప్ హాజరవుతారని వైట్‌హౌజ్ తన ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో అమెరికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ట్రంప్ నిబద్ధతతో ఉన్నారని వైట్‌హౌజ్ పేర్కొంది. అమెరికా శ్రేయస్సు, భద్రతకు ఇండో-పసిఫిక్ రీజన్‌తో స్వేచ్ఛాయుతంగా ఉండే ప్రాముఖ్యాన్ని ట్రంప్ చర్చిస్తారని వివరించింది.