అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మధ్య సింగపూర్‌లో జరగనున్న చర్చలు సానుకూల ఫలితాలే వస్తాయన్న అంచనాలు ఉన్నాయి కానీ ఒక్కసారి గత చరిత్ర చూస్తే మనకి అన్నీ ఫెయిల్యూర్ స్టోరీలే కనిసిస్తాయి. కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన, భద్రతకు సంబంధించిన చర్చల విషయంలో గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన 11 మంది ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయారు. 1960 దశకంలో అమెరికాలో కెన్నడీ, జాన్సన్ అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఉత్తర కొరియాతో కొంతవరకు సత్సంబంధాలనే కొనసాగించారు. 1968లో ఉత్తర కొరియా అమెరికాకు చెందిన నిఘా నౌకల్ని నిర్బంధించడం, గూఢచర్య విమానాల్ని పేల్చివేయడం వంటి కార్యక్రమాలు చేపట్టింది.
ఆ తర్వాత రెండేళ్లకి ఉత్తర కొరియా తన ధోరణి మార్చుకొని శాంతి చర్చలకు సిద్ధమంటూ ప్రకటించింది. 1974లో అమెరికా కాంగ్రెస్‌కు బహిరంగ లేఖరాసినప్పటికీ నాటి అమెరికా నాయకత్వం ప్రతిస్పందించలేదు. ఆ తర్వాత కాలంలో అప్పటి ఉత్తర కొరియా అధినేత కిమ్ ఇల్ సంగ్, నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు సాగించారు. దక్షిణ కొరియా భూభాగంలో సైనిక బలగాన్ని తగ్గించాలని కార్టర్ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ చర్చల విషయంలో ముందడుగు పడలేదు. ఇక 1981లో అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించారు. దక్షిణా కొరియాను సమర్థిస్తూ మిలటరీ బలగాల్ని పెంచారు. ఆ తర్వాత అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ విదేశాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణలో భాగంగా దక్షిణకొరియా నుంచి కూడా భారీ సంఖ్యలో సైన్యాన్ని వెనక్కి రప్పించారు. కానీ ఉత్తరకొరియాతో శాంతి చర్చలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. 1993–2001 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ ఉత్తర కొరియాతో ఉన్న సంక్షోభ పరిష్కారానికి కొంతలో కొంతవరకు ప్రయత్నాలు చేశారు.
1994లో కొన్ని ప్రతిపాదనలు రూపొందించడం, 2001లో ఒక సంయుక్త ప్రకటన జారీ కావడం వంటివి మైలురాళ్లుగా నిలిచాయి. దాదాపు పదేళ్ల పాటు శాంతియుత సంబంధాలే కొనసాగినా, జార్డ్ డబ్ల్యూ బుష్ అధ్యక్షుడయ్యాక మళ్లీ సంబంధాలు క్షీణించాయి. ఉత్తరకొరియా తదితర దేశాలనూ దుష్ట కూటమి అని అభివర్ణించిన బుష్ కొరియాతో ఉద్రిక్తతలనే పెంచి పోషించారు. ఇరు దేశాల మ«ధ్య రాజకీయ, ఆర్థిక సయోధ్యకు ఉద్దేశించిన ప్రతిపాదనలకు అమెరికా కట్టుబడి లేకపోవడంతో ఉత్తర కొరియా 2003 సంవత్సరంలో అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలిగింది. దీంతో ఇరు దేశాల మధ్య చర్చలు మరి ముందుకు సాగలేదు.
2006 నుంచి ఉత్తరకొరియా ముమ్మరంగా అణు పరీక్షలు
ఆ తర్వాత కాలంలో ఉత్తర కొరియా విస్తృతంగా అణు పరీక్షల్ని నిర్వహించడం మొదలు పెట్టింది. గత ఏడాది వరకు అణు పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. 2009లో ఒబామా అధ్యక్షుడు అయ్యాక ఉత్తర కొరియాతో సంబంధాల విషయంలో వ్యూహాత్మక సహనం అనే విధానాన్ని పాటిస్తూ వచ్చారు. ఆర్థిక ఆంక్షలతో ఉత్తర కొరియా దారిలోకి వస్తుందని భావించారు. మరోవైపు 2011లో ఉత్తర కొరియాలో అధికార పగ్గాలు చేపట్టిన కిమ్ జాంగ్ ఉన్ ఆంక్షల్ని లెక్క చేయకుండా అణు పరీక్షలు ముమ్మరంగా సాగించారు. ఖండాంతర క్షిపణుల్ని పరీక్షించారు. హైడ్రోజన్ బాంబు పరీక్షలు కూడా జరిపినట్టు ప్రకటించారు. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య అణుబాంబుల్లాంటి మాటల తూటాలు పేలాయి. చివరికి ఉత్తర కొరియాను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఆర్థిక ఆంక్షల్ని తొలగింపజేసుకోవడం కోసం కిమ్ కొన్ని మెట్లు దిగివచ్చారు. అణు పరీక్ష కేంద్రాలను ధ్వంసం చేస్తూ శాంతి మంత్రానికి పచ్చ జెండా ఊపారు. ఇప్పుడు మళ్లీ బంతి అమెరికా కోర్టులోనే ఉంది. ఈ సారైనా ఇరు దేశాల మధ్య చర్చలు ముందుకు వెళతాయా, లేదా గతంలో మాదిరిగా ఇదో ప్రహసనంగా మారిపోతుందా అన్నది ట్రంప్ చేతుల్లోనే ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment