ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) గురించి నిజాలు దాచి కల్లోలానికి కారణమైందంటూ అమెరికా రాష్ట్రం మిస్సోరి చైనాను పరిహారం కోరుతూ మంగళవారం స్థానిక కోర్టులో దావా వేసింది. ఉద్దేశపూర్వకంగానే డ్రాగన్ దేశం ప్రపంచాన్ని మోసం చేసిందని... మహమ్మారిని అరికట్టడానికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే సంక్షోభం తలెత్తిందని ఆరోపించింది. చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారిగా బయటపడ్డ కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అన్ని దేశాల కంటే అగ్రరాజ్యం అమెరికాలోనే ఎక్కువ కరోనా మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఇతర నేతలు చైనానే వైరస్‌ను సృష్టించి ప్రపంచం మీదకు వదిలిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. (చైనాపై అమెరికన్ లాయర్ కేసు)
ఈ క్రమంలో కరోనా సంక్షోభంపై చైనాను నిలదీయాలంటూ ట్రంప్ కాంగ్రెస్‌లో పిలుపునిచ్చిన నేపథ్యంలో మిస్సోరి ఆసియా దేశంపై ఫెడరల్ కోర్టులో వాజ్యం దాఖలు చేసింది. ఈ విషయం గురించి మిస్సోరి అటార్నీ జనరల్ ఎరిక్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్-19 వ్యాప్తి, ప్రమాదం గురించి చైనా ప్రభుత్వం ప్రపంచానికి అబద్ధాలు చెప్పింది. చాపకింద నీరులా అంటువ్యాధి వ్యాపించింది. దీనికి వాళ్లు జవాబుదారీగా ఉండాల్సిందే’’అని పేర్కొన్నారు. అదే విధంగా కరోనా సంక్షోభం కారణంగా మిస్సోరి బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిందని... దీనిని చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ భరించాలని డిమాండ్ చేశారు. మనిషి నుంచి మనిషికి వైరస్ వ్యాపించదని చెప్పి ఇంతటి విధ్వంసానికి చైనా కారణమైందని మండిపడ్డారు. (వలసల నిషేధంపై స్పష్టతనిచ్చిన ట్రంప్..!)
కాగా అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన మిస్సోరి ప్రభుత్వం చైనాపై వేసిన దావా (అమెరికా చట్టాల ప్రకారం విదేశీ ప్రభుత్వాలపై చర్యలు తీసుకునే అధికారం స్థానిక కోర్టుకు ఉండదు) చట్టపరంగా ఎంతవరకు నెగ్గుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక మిస్సోరిలో మంగళవారం నాటికి 189 కరోనా మరణాలు సంభవించాయి. ఇదిలా ఉండగా... కోవిడ్-19ను సృష్టించి వ్యాప్తి చేసిందని ఆరోపిస్తూ... చైనా 20 లక్షల కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలని కోరుతూ అమెరికా న్యాయవాది లారీ క్లేమన్ కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment