గుజరాత్‌లో ఉప్పుపై పన్ను నేటి నుంచి ఆందోళనలు
అహ్మదాబాద్: గుజరాత్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఉత్పత్తిదారులు నేటి నుంచి సమ్మెకు దిగుతున్నారు. ఉప్పు తయారీని, సరఫరాను నిలిపివేస్తామని చెబుతున్నారు. ‘సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ వినియోగించే ఉప్పుపై గుజరాత్ ప్రభుత్వం 5%విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను విధించింది.
దీనిని ప్రజలతోపాటు తయారీదారులూ వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మూడురోజులపాటు ఉత్పత్తి, సరఫరాను నిలిపివేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తాం. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి. లేదంటే మా నిరసనను మరిన్ని రోజులు కొనసాగిస్తామం’ అని చిన్నతరహా ఉప్పు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు బచ్చుభాయ్ అహిర్ తెలిపారు. దీనికి నమక్ సత్యాగ్రహ్ సమితి కూడా మద్దతు పలికింది.