బతికుండగానే పులుల బోనులో విసిరేశారు
బీజింగ్: చైనాలో ఓ వన్యమృగ పరిరక్షణ కేంద్రంలోని వాటాదారుల మధ్య ఏర్పడిన వివాదం మూగజీవుల పాలిట శాపంగా మారింది. తనను మూగజీవాలు తీసుకెళ్లేందుకు అడ్డుకున్నారని కోపంతో ఏకంగా బతికి ఉన్న ఓ గాడిదను నేరుగా కొంతమంది వ్యక్తుల సహాయంతో పులుల ఎన్‌క్లోజర్‌లో పడేశాడు. రెండు నిమిషాల్లోనే ఆ గాడిదపై పులులు దాడి చేసి చంపేశాయి. ఈ సంఘటన జూకు వచ్చిన వారిని కంటతడిపెట్టించింది. అతడు మరోసారి గొర్రెలను వేసే ప్రయత్నం చేయడంతో అతడిని అడ్డుకున్నారు. ఈ ఘటన చైనాలోని జియాంగ్‌సు ప్రావిన్స్‌లోని చాంగ్‌జౌలోని జూపార్క్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. చైనాలో ఓ జూపార్క్‌ను కొంతమంది పెట్టుబడిదారులు కలిసి నిర్వహిస్తున్నారు. అయితే, కొద్ది కాలంగా అది నష్టాల్లో నడుస్తోంది. దీంతో అందులో తన వాటాగా ఉన్న కొన్ని జంతువులను అమ్మేసుకుంటానని మిగితా వాటాదారులకు ఆ వ్యక్తి చెప్పగా అందుకు వారు నిరాకరించారు. దీంతో కోపంలో కొంతమంది మనుషులని పెట్టి ఈ పనిచేయించాడు. దీనిపట్ల పలువురు నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.