
క్యుబెక్: జీ–7 శిఖరాగ్ర సదస్సు అనంతరం సభ్య దేశాలు విడుదలచేసిన ఉమ్మడి ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆతిథ్య కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై మండిపడ్డారు. సదస్సు ముగియడానికి ముందే సింగపూర్ బయల్దేరిన ట్రంప్ విమానంలోనే ఉమ్మడి ప్రకటనపై స్పందిం చారు. ట్రూడో విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ విలేకర్ల సమావేశంలో ట్రూడో చెప్పినవి అబద్ధాలు. నిజం ఏంటంటే అమెరికా కంపెనీలు, కార్మికులు, వ్యవసాయదారులపై కెనడా విధిస్తున్న టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి.
ఆ ప్రకటనను నమ్మొద్దని మా ప్రతినిధులకు చెప్పాను. జీ–7 సమావేశ సమయంలో ఎంతో అణకువ, మర్యాదగా నటించిన ట్రూడో నేను వెళ్లిన తరువాత తనను ఎవరూ భయపెట్టలేరని మీడియా ముందు చెప్పారు’ అని డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. టారిఫ్‌ల పెంపునకు ట్రంప్ భద్రతను సాకుగా చూపడం.. క్లిష్ట సమయాల్లో అమెరికా మిత్ర దేశాలకు మద్దతుగా నిలిచిన కెనడా మాజీ నాయకులను అవమానించడమేనని జస్టిన్ ట్రూడో మీడియా ముందు వ్యాఖ్యానించారు. ట్రంప్ ట్వీట్లపై ట్రూడో కార్యాలయం స్పందిస్తూ.. తమ ప్రధాని ఇంతకుముందు చెప్పని కొత్త విషయాలు వేటినీ చెప్పలేదని వెల్లడించింది.