జకార్తా : ప్లాస్టిక్ భూతానికి మరో సముద్ర జీవి బలైంది. ప్రాణాలు కోల్పోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఓ తిమింగలాన్ని.. తరలించేందుకు ప్రయత్నించగా దాని శరీరం చెల్లాచెదురైపోయింది. ఈ హృదయ విదారక ఘటన ఇండోనేషియాలోని కపోటా ఐలాండ్‌లో చోటుచేసుకుంది. పర్యావరణాన్ని మనిషి ఎంతలా నాశనం చేస్తున్నాడు అనే దానికి తార్కాణంగా నిలిచింది.
వివరాలు... ఇండోనేషియాలోని వకాటోబి జాతీయ పార్కులోని ఓ తిమింగలం సోమవారం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. విగత జీవిగా పడి ఉన్న ఆ తిమింగలాన్ని పార్కు అధికారులు అక్కడి నుంచి తొలగించే క్రమంలో దాని పొట్టలో నుంచి సుమారు వెయ్యి రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు(6 కిలోల ప్లాస్టిక్) బయటపడ్డాయి. కాగా ప్లాస్టిక్‌ను మింగడం వల్లే ఆ తిమింగలం మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ తిమింగలానికి సంబంధించిన ఫొటోలు పర్యావరణ హితులనే కాక యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్లాస్టిక్‌పై పోరాడాల్సిన ఆవశ్యకతను మరోమారు గుర్తుచేస్తున్నాయి.
తిమింగలం శరీరం నుంచి బయటపడ్డ కప్పులు, చెప్పులు, స్ప్రింగులు
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు కావాలా!?
ఇండోనేషియాలోని వకాటోబి జాతీయ పార్కు వైవిధ్యమైన జీవజంతుజాలాలకు ఆనవాలం. బందా, ఫ్లోర్స్ సముద్రాల మధ్య కేంద్రీకృతమైన ఈ మెరైన్ పార్కు సుమారు 942 రకాల చేప జాతులు, 750 రకాల పగడపు దిబ్బలకు ప్రసిద్ధి. ఈ క్రమంలోనే 2005 నుంచి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలంటూ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదనలు పంపుతోంది. అయితే ప్రస్తుతం ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఈ తిమింగలం శరీరంలో దొరికిన ప్లాస్టిక్ వ్యర్థాలను చూసిన పర్యావరణ ప్రేమికులు ఇండోనేషియా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడం తర్వాత విషయం.. ముందు ప్లాస్టిక్ రక్కసిని కట్టడి చేసి జీవజాతులకు రక్షణ కల్పిస్తే బాగుంటుంది అని హితవు పలుకుతున్నారు.
చైనా తర్వాత ఇండోనేషియానే!
ఆసియా ఖండంలో ఉన్న 60 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్ దేశాల్లోనే నిక్షిప్తమై ఉన్నాయని మెక్‌నెసీ సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అనే సంస్థ 2015లో నివేదిక వెల్లడించింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో చైనా తర్వాత ఇండోనేషియా అత్యంత దుర్భర స్థితిలో ఉందని పేర్కొంది. తీర ప్రాంత అందాలను వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులు ప్లాస్టిక్ వస్తువులను అక్కడ పడేయడం వల్లే సముద్ర జీవులు అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని తెలిపింది. (మనిషన్న జంతువు ప్రతిచోటా విధ్వంసం సృష్టిస్తోంది)
కాగా ఇండోనేషియా సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన తిమింగలం శరీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు లభించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ఈ నేపథ్యంలో ఇండోనేషియా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ప్లాస్టిక్ వినియోగం అనే జాఢ్యం కేవలం ఒక్క ఇండోనేషియాకే పరిమితం కాలేదని.. ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలని ప్రమాణాలు చేయిస్తోన్న అనేక దేశాలు ఆ వాగ్దానాలను తుంగలో తొక్కుతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలని ఓ వైపు ఉపన్యాసాలు దంచుతున్న మానవాళి.. తన మూర్ఖత్వంతో భూమిపై నివసిస్తున్న మిగిలిన జీవజాతులను ఇబ్బంది గురి చేయడంలో ఏమాత్రం సిగ్గుపడటం లేదని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment