న్యూఢిల్లీ: చైనాలో వందల మందికి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మందికి వ్యాపించి ప్రపంచ ప్రజలను నేడు గడగడలాడిస్తున్న కరోనావైరస్ గురించి సోషల్ మీడియాలో ఉన్నవి లేనివి ప్రచారమవుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ అంటే ఏమిటీ? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? అది ఎక్కడ పుట్టింది? ఎలా విస్తరిస్తుంది? దాని లక్షణాలేమిటీ? దాని నుంచి రక్షించుకోవడం ఎలా? అన్న అంశాలను మరోసారి పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. (చైనాలో 131కి పెరిగిన మృతుల సంఖ్య)
చైనాలోని వుహాన్ పట్టణంలోని ‘సీ ఫుడ్’ మార్కెట్ నుంచి కరోనావైరస్ మానవులకు సంక్రమించినట్లు చైనా వైద్యాధికారులు ఇప్పటికే ధ్రువీకరించారు. ఆ మార్కెట్‌లో సీఫుడ్‌తోపాటు కుక్కలు, నక్కలు, తోడేళ్ల నుంచి కప్పలు, పాములు, పందులు, ఇతర వన్య ప్రాణులను సజీవంగా విక్రయిస్తున్నారు. ఆ సజీవ జంతువుల నుంచే మానవులకు వైరస్ వ్యాపించి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. దీన్ని ఇప్పుడు ‘2019 నావల్ కరోనా (2019 ఎన్ సీఓవీ)’గా వ్యవహరిస్తూ నివారణా వ్యాక్సిన్ కనుగొనేందుకు చైనా వైద్యాధికారులు కృషి చేస్తున్నారు. (ఒక్క మంత్రంతో కరోనా వైరస్ మాయం..!)
కరోనా వైరస్ పేరెలా వచ్చింది ?
ఈ వైరస్‌ను మైక్రోస్కోప్ కింది నుంచి పరిశీలిస్తే గుండ్రటి ఆకారం చుట్టూ మేకుల్లా పొడుచుకొచ్చిన పోషకపదార్థం ఉంటుంది. కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థం. ఈ వైరస్ చుట్టూ కిరీటి ఆకృతి కనిపిస్తుంది కనుక దానికి కరోనా అని శాస్త్ర వేత్తలు వ్యవహరిస్తున్నారు. 2003లో చైనాలో విజృంభించిన సార్స్ వ్యాధి కూడా కరోనావైరస్ ద్వారా వచ్చిందే. ఇప్పటి వైరస్ అదే జాతికి చెందినదైనప్పటికీ ఇంకాస్త శక్తివంతమైనదిగా భావిస్తున్నారు. అందుకని నాటికన్నా మృతుల సంఖ్య ఎక్కువ ఉండవచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. నాడు సార్స్ కారణంగా 800 మంది మరణించిన విషయం తెల్సిందే. ఈ బీరు తాగితే కరోనా వైరస్ సోకుతుందా..!
వ్యాధి లక్షణాలు
కరోనావైరస్ సోకినట్లయితే మొదటి దశలో శ్వాసపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. దమ్మొస్తుంది. ఛాతిలో నొప్పిగా ఉంటుంది. రెండో దశలో దగ్గు, జ్వరం వస్తుంది. మూడో దశలో అది పూర్తి నిమోనియాగా మారుతుంది. అప్పటికీ నివారించలేకపోతే శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ప్రాణం పోతుంది.
ప్రాణాంతకమైన వ్యాధి
చైనాలో ఈ వ్యాధి బారిన పడి దాదాపు బుధవారం నాటికి 140 మంది మరణించారు. 16 దేశాలకు ఇది విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు దాదాపు నాలుగున్నర వేల మందికి ఇది సోకినప్పటికీ ఒక్క చైనాలో మినహా మినహా మిగతా దేశాల్లో మృతుల గురించి వార్తలు లేవు. అందుకని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతవరకు ‘అంతర్జాతీయ వైద్య అత్యయిక పరిస్థితి’ని డిక్లేర్ చేయలేదు. వ్యాధి సోకిన రోగులు ఆస్పత్రిలో చేరి 14 రోజులపాటు ఇంకుబేటర్‌లో ఉంటే చాలు. వ్యాధి నుంచి బయట పడవచ్చు. (ఎకానమీపై కరోనా ఎటాక్!)
ఆరున్నర కోట్ల మందికి ముప్పు!
సార్స్ కన్నా భయంకరమైన కరోనా వైరస్ ప్రపంచంలోని 18 దేశాలకు విస్తరించే అవకాశం ఉందని, దాని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆరున్నర కోట్ల మంది మృత్యువాత పడే ప్రమాదం ఉందని అమెరికా ప్రభుత్వ వైద్య పరిశోధనా మండలి ‘కంప్యూటర్ సిములేషన్’ ద్వారా అంచనా వేసింది. వాస్తవానికి ఇప్పుడు సార్స్‌కన్నా ప్రస్తుత కరోనా వైరస్ తక్కువ ప్రభావాన్ని చూపిస్తోంది. మృతుల సంఖ్య కూడా తక్కువుగానే ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఎప్పటికప్పుడు సబ్బు, ఆల్కహాల్‌తో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
- దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా శుభ్రమైన గుడ్డను అడ్డం పెట్టుకోవాలి. అత్యవసర సమయాల్లో మడచిన మోచేతిని అడ్డుగా పెట్టుకోవాలి.
- దగ్గు, తుమ్ములతో బాధ పడుతున్న వారికి దూరంగా ఉండాలి.
- ముక్కు, నోటిని కప్పి ఉంచే మాస్క్‌లు ధరించాలి.
- ఉడికీ ఉడకని మాంసం తినరాదు.
- సరైన సంరక్షణలో లేని జంతువుల వద్దకు వెళ్లరాదు.
భారత్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు
నేపాల్, శ్రీలంక లాంటి పొరుగు దేశాల్లో పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ ఇప్పటి వరకు భారత్‌లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కేంద్ర వైద్య బృందాలు ఇతర దేశాల నుంచి విమాన సర్వీసులు గల భారత్‌లోని ప్రతి నగరాన్ని సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తోంది. వ్యాధి ముందుగా విస్తరించిన చైనాలోని వుహాన్‌లో భారత్ విమానం ఒకటి ఇప్పటికే సిద్ధంగా ఉంది. అక్కడున్న భారతీయులను తీసుకొని అది ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. చైనా నుంచి భారతీయులందరికి విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 011–23978046 అనే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ను నిర్వహిస్తోంది. (బాబోయ్.. కరోనా!)
Comments
Please login to add a commentAdd a comment