జెనీవా: మహమ్మారి కరోనా మృతులు, కేసుల సంఖ్యను చైనా సవరించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కోవిడ్-19 విజృంభణ అధికంగా ఉన్న సమయంలో లెక్కల నమోదులో తప్పిదాలు దొర్లి ఉండొచ్చని అభిప్రాయపడింది. అన్ని దేశాలు కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత లెక్కలను సవరించుకోవాలని శుక్రవారం సూచించింది. కాగా, ప్రాణాంతక కోవిడ్-19 పుట్టుకకు కేంద్ర స్థానంగా భావిస్తున్న చైనాలోని వుహాన్ స్థానిక ప్రభుత్వం కోవిడ్ మరణాలను ఒకేసారి 1,290 ఎక్కువ చేసి జాబితాను సవరించిన సంగతి తెలిసిందే. అంటే దాదాపుగా 50% ఎక్కువ మృతుల్ని చూపించింది.
(చదవండి: కోట్లాది చిన్నారులపై కోవిడ్ ప్రభావం: ఐరాస)
ఫలితంగా దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య 4,632కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్ని కూడా 325 పెంచింది. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 82,692కి చేరుకుంది. కోవిడ్‌పై సమాచారాన్ని పారదర్శకంగా ఉంచేందుకే జాబితాను సవరించామని వుహాన్ స్పష్టం చేసింది. వైరస్ విజృంభిస్తున్న తొలినాళ్లలో దాని కట్టడికి వ్యూహ రచన చేయడం, వైద్య సిబ్బందిని మోహరించడం వంటి పనుల్లో తీరిక లేకుండా గడపడం వల్ల గణాంకాల సేకరణ ఆలస్యమైందని వెల్లడించింది. వుహాన్ వివరణపై డబ్ల్యూహెచ్‌వో కూడా సానుకూలత వ్యక్తం చేసింది.
(చదవండి: కరోనా : శానిటైజేషన్ టనెల్స్‌తో ప్రమాదమే)
కరోనా విపత్కర పరిస్థితుల్లో కేసులను, మృతులను గుర్తించడం సవాళ్లతో కూడుకున్నదని డబ్ల్యూహెచ్‌వో కోవిడ్-19 టెక్నికల్ హెడ్ మారియా వాన్ కెర్కోవ్ అన్నారు. చాలా దేశాలు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని అన్నారు. కాగా, చైనా కరోనా లెక్కలపై ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు రేకెత్తిన సంగతి తెలిసిందే. వైరస్ పుట్టుకొచ్చిన చాలా రోజులపాటు బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదని, ఆ దిశగా ప్రయత్నించిన పలువురు వైద్యులను తీవ్రంగా శిక్షించిందనే వార్తలు కూడా వచ్చాయి.
(చదవండి: చైనాపై పెరిగిన అనుమానాలు?)
Comments
Please login to add a commentAdd a comment